
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా డైరెక్టర్ శంకర్ రూపొందిస్తోన్న పాన్ ఇండియా చిత్రం ‘గేమ్ చేంజర్’. దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఐతే, ఈ సినిమా నుంచి “జరగండి జరగండి” అనే పాట ఇటీవల లీక్ అయింది. దాంతో, దిల్ రాజు సాంగ్ లీక్‌పై సైబర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
తాజాగా ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. సైబర్ క్రైమ్ ఏసీపీ శ్రీ చాంద్ భాషా, ఎస్సై శ్రీ భాస్కర్ రెడ్డి, శ్రీ ప్రసేన్ రెడ్డి, శ్రీ సాయి తేజ్ గార్ల బృందం ఈ కేసును చేధించారు. సాంగ్ లీక్ చేసిన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని వీరిపై ఐటీ చట్టంలోని సెక్షన్ 66సీ, 66 ఆర్/డబ్ల్యూ కింద కేసు నమోదు చేశారు.
మరోవైపు, ‘గేమ్ ఛేంజర్’ సినిమా నుంచి తొలి సాంగ్‌ను దీపావళి కానుకగా విడుదల చేస్తున్నారు.
ఈ సినిమాకి తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటివరకు శంకర్ ఏ.ఆర్. రెహ్మాన్, హ్యారిస్ జైరాజ్ లతోనే పని చేశాడు. ఇప్పుడు కొత్త తరం సంగీత దర్శకులతో వర్క్ చేస్తున్నాడు. “భారతీయుడు 2” చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తుండగా, “గేమ్ ఛేంజర్” చిత్రానికి తమన్ పాటలు ఇస్తున్నాడు.