
తమిళ సంగీత దర్శకుడు ఇమ్మాన్ దాదాపు 80 చిత్రాలకు సంగీతం అందించారు. అజిత్ హీరోగా రూపొందిన “విశ్వాసం” చిత్రానికి ఇమ్మాన్ ఉత్తమ సంగీత దర్శకుడిగా జాతీయ అవార్డు కూడా అందుకున్నారు. ఐతే, ఇటీవల ఇమ్మాన్ చేసిన కొన్ని కామెంట్స్ సోషల్ మీడియాలో పెద్ద కలకలం సృష్టించాయి. తమిళ్ హీరో శివకార్తికేయన్ తో ఈ జన్మలో మాట్లాడను, అతని సినిమాకి సంగీతం ఇవ్వను అని ప్రకటించాడు.
శివకార్తికేయన్, ఇమ్మాన్ ఒకప్పుడు మంచి స్నేహితులు. శివకార్తికేయన్ పలు చిత్రాలకు ఇమ్మాన్ సంగీతం అందించాడు. ఐతే, ఇప్పుడు ఇద్దరి మధ్య మాటల్లేవు. ఇకపై శివకార్తికేయన్ సినిమాలకు పని చెయ్యను అని ఇమ్మాన్ ప్రకటించడం పెద్ద కలకలం సృష్టించలేదు. కానీ అతని ముఖం చూడను, అతన్ని కలవను అనడం హాట్ టాపిక్ గా మారింది.
“వ్యక్తిగత కారణాల వల్లే ఈ నిర్ణయం తీసుకున్నా. నా పిల్లలను దృష్టిలో పెట్టుకొని ఆ కారణమేంటో చెప్పను” అని ఇమ్మాన్ అన్నారు. దాంతో, రకరకాల ఊహాగానాలు, రూమర్లు మొదలయ్యాయి.
దాంతో, ఇమ్మాన్ మాజీ భార్య మోనికా రిచర్డ్ స్పందించారు. ఇమ్మాన్ తో తన విడాకుల విషయంలో శివ కార్తికేయన్ తప్పేమి లేదు అని ప్రకటించారు.

“ఫ్యామిలీ ఫ్రెండ్ గా శివకార్తికేయన్ మా ఇద్దరి మధ్య ఉన్న సమస్యలను తొలగించేందుకు ప్రయత్నించారు. కలిసే ఉండేలా అడిగారు. కానీ ఇమ్మాన్ డివోర్స్ కావాలని పట్టుపట్టాడు. ఇప్పుడు అవకాశాలు తగ్గడంతో ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు,” అన్నట్లుగా మోనికా స్పందించారట.