
‘వెన్నెల’, ‘ప్రస్థానం’, ‘ఆటోనగర్ సూర్య’, ‘డైనమైట్’ వంటి సినిమాలు తీసిన దర్శకుడు దేవాకట్టాది విలక్షణమైన శైలి. ఇప్పుడు ‘రిపబ్లిక్’ సినిమా తీశారు. సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించారు. సరిగ్గా సినిమా విడుదల సమయంలో సాయి తేజ్ రోడ్డు ప్రమాదానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఐతే, ఈ సినిమా విషయంలో మాత్రం సాయి తేజ్ తన వెనుకాల ఒక సైనికుడిలా నిలబడ్డారని అంటున్నారు దేవాకట్టా….
– ‘రిపబ్లిక్’ సినిమా తీయడానికి కారణం నాకు కొన్ని విషయాల్లో సరైన జ్ఞానం లేదని అర్థమైన రోజు ఈ స్క్రిప్ట్ కి బీజం పడింది. చదువుకున్న నాలాంటి వాడికే ప్రజాస్వామ్య వ్యవస్థ గురించి పూర్తి అవగాహన లేనప్పుడు అంతగా చదువులేని వాళ్లకు ఏం అర్థమవుతుందనే సిగ్గుతో దానిపై స్టడీ చేసుకుని ఈ కథను తయారు చేసుకున్నాను. మనం నిజమైన ప్రజాస్వామ్యంలో బతకడం లేదని అర్థం చేసుకున్నాను. ఏ పార్టీకి, మనిషికి అయినా అపరిమితమైన శక్తి ఇచ్చినప్పుడు కచ్చితంగా కరెప్ట్ అవుతాడు. అది మానవ నైజం. పవర్ బ్యాలెన్స్‌డ్‌గా ఉన్నప్పుడే బావుంటుంది. ట్రంప్‌లాంటి వ్యక్తి ఏ దేశంలో అయినా డిక్టేటర్ అయ్యుండేవాడు. కానీ ఆయన నియమించిన జడ్జీలే ఆయన్ని డిక్టేటర్ కానీయకుండా అడ్డుకున్నారు. ఏ పార్టీని ఉద్దేశించి రాయలేదు. ఈ ఐడియాను ఓ రోజు జిమ్‌లో సాయితేజ్‌కు చెప్పాను. సాయితేజ్ ఓ కామన్ మ్యాన్‌గా ఈ కథకు రిలేట్ అయ్యాడు. ఈ పాయింట్ ని స్క్రిప్ట్ గా రాయక ముందే నాతోనే ఈ సినిమా చేయాలని తేజ్ ప్రామిస్ తీసుకున్నాడు.ఇందులో ప్రజలకు ఏదీ మంచిది అనేది చెప్పలేదు. ఓ ప్రజాస్వామ్య వ్యవస్థ అనుకున్నప్పుడు అది ఎలా అవ్యస్థంగా ఉందని ఎత్తి చూపిస్తూనే, అదొక వ్యవస్థగా మారాలని సొల్యూషన్‌గా నిర్వచనం చెప్పే ప్రయత్నం చేశాం.
– వెన్నెల, ప్రస్థానం సినిమాలు చేసేటప్పడు నాకు రిసోర్సస్ తక్కువగా ఉన్నాయి. కానీ.. లిబర్టీ ఉండేది. కానీ ఓ స్థాయి తర్వాత మన చుట్టు పక్కల ఉన్నవాళ్ల లెక్కలు వచ్చేస్తాయి. ప్రస్థానం బ్లాక్‌బస్టర్ కాకపోవడానికి కామెడీ ట్రాక్ లేకపోవడమో, మరోటో అని నన్ను కన్విన్స్ చేసి.. నేను ఆ ట్రాప్‌లో పడ్డ తర్వాత నేనెదైతే చెత్త పెట్టానో దాన్ని ప్రజలు తిప్పి కొట్టారు. కానీ రిపబ్లిక్ విషయంలో ఇలాంటివేమీ లేకుండా నేను ఓన్ చేసుకుని చేసిన సినిమా. నా విజన్‌లోనే నన్ను సినిమా తీసేలా సాయితేజ్ సినిమా చేయడానికి ఎంకరేజ్ చేశాడు. సైనికుడిలా నాకు అండగా నిలబడ్డాడు.
– ఫ్రస్టేషన్‌లో, బాధలో ఉన్నప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోకూడదు. అలా తీసుకున్న నిర్ణయమే డైనమైట్ సినిమా. అదే సమయంలో నేను యు.ఎస్‌లో ఫ్యామిలీని వదిలేసి వచ్చాను. అర్థికంగా ఎలాంటి సపోర్ట్ లేదు. ఇలాంటి కారణాలతో కన్విన్స్ అయిన ఒప్పుకున్న సినిమా. ఆ సినిమాను నేను 9 రోజులు మాత్రమే షూట్ చేశాను. తర్వాత వాళ్లకు కావాల్సి వచ్చినట్లు వాళ్లే షూట్ చేసుకున్నారు. దాని తర్వాత నేను దర్శకుడిగా ఇతరుల నమ్మకాన్ని సంపాదించుకోవడానికి ఇంకా సమయం పట్టింది. “రిపబ్లిక్” ఆ నమ్మకాన్ని పెంచుతుందని భావిస్తున్నాను.
– నేను ఎవరినీ వేదికపై విమర్శించలేదు. ఆన్‌లైన్ టిక్కెటింగ్ వల్ల పారదర్శకత ఉంటుంది. కానీ తర్వాత స్టెప్స్ ఏంటని నేను అడిగానంతే.
– సాయితేజ్‌ను యాక్సిడెంట్ తర్వాత కలిశాను. అక్టోబర్ 1న సినిమాను విడుదల చేద్దామని తనతో మాట్లాడుకున్న తర్వాతే ఫైనల్‌గా ఓకే చేశాం. తను ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను చూశాడు. తను హండ్రెడ్ పర్సెంట్ ఓకే అనుకునే వరకు ఐసోలేషన్‌లో ఉంటే మంచిదని భావించాం. తను త్వరగా కోలుకుంటున్నాడు. మాట్లాడుతున్నాడు. కాస్త కాస్త ఆహారం కూడా తీసుకుంటున్నాడు. తను రికవర్ కావడానికి సమయం పడుతుంది.