
ధనుష్ సూపర్ ఆర్టిస్ట్. ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోతాడు. ఇప్పుడు ఏకంగా హాలీవుడ్ సినిమాలో నటిస్తున్నాడు. తమిళ సినిమారంగంలో తనకంటూ ఒక మంచి స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు ధనుష్. ఐతే, ఇన్నేళ్ల కెరీర్ లో ఎప్పుడూ సూపర్ స్టార్ రజినీకాంత్ ని అనుకరించలేదంటున్నాడు ధనుష్.
ధనుష్ రజినీకాంత్ అల్లుడు. రజినీకాంత్ పెద్ద కూతురుని పెళ్లి చేసుకున్నాడు. “రజిని సార్ కి నేను అభిమానిని. కానీ అల్లుడిని కాబట్టి ఆయన ఇమేజ్ ని వాడుకుంటున్నా అని కామెంట్స్ చేస్తారనే ఉద్దేశంతో ఆ జోలికి వెళ్ళలేదు. కావాలనే, ఏ సినిమాలోనూ రజినీకాంత్ మేనరిజమ్ ఫాలో కాలేదు. కానీ తొలిసారిగా అలా చేశాను,” అంటున్నాడు ధనుష్.
ధనుష్ నటించిన “జగమే తందిరం”అనే తమిళ చిత్రం ఈ నెల 18న నెట్ ఫ్లిక్స్ లో విడుదల కానుంది. ఈ సినిమాకి కార్తీక్ సుబ్బరాజు దర్శకుడు. కార్తీక్ సుబ్బరాజు ఈసారి ఎలాగైనా రజినీకాంత్ మేనరిజంలు వాడుదామని కోరాడు. సో, నేను ఒప్పుకున్నా అని చెప్తున్నాడు ధనుష్.