
“నీలావకు ఎన్ మెల్ ఎన్నడి కోపం” ((హే పిల్లా చంద్రుడికి నా మీద ఎందుకు కోపం) అనే పేరుతో కొత్త సినిమాని ప్రకటించాడు ధనుష్. ఇందులో ధనుష్ నటించడం లేదు. యువ హీరోలు, హీరోయిన్లతో ఈ సినిమాని ధనుష్ తీస్తున్నాడు. ఆయన కేవలం దర్శకుడే ఈ సినిమాకి.
ధనుష్ ఇప్పటికే ‘పా పాండి” అనే సినిమాని డైరెక్ట్ చేశాడు. దానికి మంచి పేరు వచ్చింది. ప్రస్తుతం తనే హీరోగా నటిస్తూ ఒక సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. ఇంకా పేరు పెట్టని ఆ సినిమా త్వరలోనే విడుదల కానుంది. అలా ఆ సినిమా సెట్ పై ఉండగానే తన డైరెక్షన్ లో ముచ్చటగా మూడో సినిమాని ప్రకటించాడు. ఈ వరుస చూస్తుంటే ధనుష్ దర్శకత్వంపై మోజు పెంచుకుంటున్నట్లు కనిపిస్తోంది.
ధనుష్ తండ్రి (కస్తూరి రాజా), అన్నయ్య (సెల్వ రాఘవన్) దర్శకులే. ఆయన మాజీ భార్య ఐశ్వర్య కూడా దర్శకురాలే. ధనుష్ కి కూడా మొదటి నుంచి ఆ మోజు ఉంది. అది ఇప్పుడు ఎక్కువైంది.
ధనుష్ హీరోగా కూడా బిజీగానే ఉన్నాడు మరి. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఒక పొలిటికల్ మూవీ చేస్తున్నాడు. అలాగే ఇంకో రెండు తమిళ సినిమాలు కూడా లైన్లో ఉన్నాయి. హీరోగా తమిళ, తెలుగు, హిందీ, హాలీవుడ్ లలో నటించిన ఈ హీరో ఇప్పుడు డైరెక్షన్ కూడా చేస్తూ మరో కమల్ హాసన్ లా మారుతున్నాడు.