రాజమౌళిని వర్మ విమర్శించాడా?

రాజమౌళి సినిమా విడుదలైంది అంటే చాలు ఆ సినిమాని ఆకాశానికి ఎత్తేస్తారు రామ్ గోపాల్ వర్మ. రాజమౌళి దర్శకత్వ ప్రతిభకి రామ్ గోపాల్ వర్మ సెల్యూట్ కొట్టిన సందర్భాలే ఎక్కువ. “ఈగ” నుంచి అదే చూస్తున్నాం. అలాంటి వర్మ రాజమౌళిని విమర్శించాడు అంటే నమ్మగలమా.

“ఆర్ ఆర్ ఆర్” విడుదల తర్వాత కూడా వర్మ ఆ సినిమా బాక్సాఫీస్ ప్రభంజనం గురించి అనేక ట్వీట్లు పాజిటివ్ గా రాశారు. కానీ, రాజమౌళి తీసిన “ఆర్ ఆర్ ఆర్”ని వర్మ తాజాగా తక్కువ చేసి మాట్లాడారని, మొదటిసారి వర్మ రాజమౌళి ఇజ్జత్ తీసాడంటూ యూట్యూబ్ ఛానెల్స్ హడావిడి చేస్తున్నాయి. వాటిని పట్టుకోని రాజమౌళి అభిమానులు, రాంచరణ్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ వర్మని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.

ఇంతకీ జరిగిన విషయం ఏంటంటే….

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో రామ్ గోపాల వర్మ ఇండియన్ సినిమా బాక్సాఫీస్ ట్రెండ్స్ గురించి మాట్లాడారు. ఈ మధ్య కాలంలో థియేటర్ కి వెళ్లి చూసిన సినిమా “ఆర్ ఆర్ ఆర్” మాత్రమే అని వెల్లడించారు ఆ ఇంటర్వ్యూలో. ఐతే, “ఆర్ ఆర్ ఆర్” మీకు ఎలా అనిపించింది అని అడిగితే “సర్కస్” చూసినట్లు అనిపించింది అని బదులు ఇచ్చారు.

RRR

ఆ ఒక్క మాటని పట్టుకొని దాన్ని నెగెటివ్ చేస్తున్నారు ట్రోలర్స్. నిజానికి ఆయన పాజిటివ్ గానే చెప్పారు. “చిన్నప్పుడు జెమిని సర్కస్ చూసినప్పుడు ఎలా ఎక్సయిటింగ్ గురయ్యేవాడినో… అలా అనిపించింది….” అనేది ఆయన భావం. కానీ ఆయన చెప్పింది పూర్తిగా వినకుండానే వర్మ “ఆర్ ఆర్ ఆర్” సినిమాని సర్కస్ తో పోల్చి కించపరిచారు అని హడావిడి చేస్తున్నారు.

మరోవైపు, “ఆర్ ఆర్ ఆర్” సినిమాకి ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరిలో అవార్డు వచ్చేలా ఉంది అంటూ హాలీవుడ్ మీడియా రాస్తోంది.

 

More

Related Stories