
అగ్ర నిర్మాత దిల్ రాజ్ తమిళ సినిమా పరిశ్రమలో తన సత్తా చాటాలని ‘వరిసు’ (వారసుడు) నిర్మించారు. తమిళంలో సూపర్ స్టార్ విజయ్ తో ఈ సినిమా తీశారు. కానీ, రిలీజ్ విషయంలో మాత్రం ఆయన ఎంతో ఇబ్బంది పడుతున్నారు. రిలీజ్ డేట్ విషయంలో గందరగోళం. ఇక అమెరికాలో ప్రీమియర్ షోల విషయంలో కంగాళీ.
అంత పెద్ద నిర్మాత అయి ఉండి… ఆయన రిలీజ్ కి మూడు రోజుల ముందు వరకు పనులు పూర్తి చెయ్యలేక పోవడం విచిత్రంగా ఉంది. నిర్మాణ ఖర్చులు ఎలా తగ్గించాలి, సినిమా నిర్మాణం ప్రొఫెషనల్ గా ఎలా తీయాలి అని తోటి నిర్మాతలకు సలహాలు ఇచ్చే ఆయన తన సొంత సినిమాని సరిగ్గా రిలీజ్ చేసుకోలేకపోతున్నారు. ఈ రోజు వరకు కూడా తెలుగులో ‘వారసుడు’ సినిమా జనవరి 11నే విడుదల అవుతుంది అని ప్రకటించలేకపోవడం ఆయన అయోమయానికి ఉదాహరణ.
సంక్రాంతికి విడుదల అవుతున్న అన్ని సినిమాల కన్నా ముందే… ఇంకా చెప్పాలంటే ఆర్నెళ్ల క్రితమే దిల్ రాజు ‘వారసుడు’ సంక్రాంతి 2023కి విడుదల అని ప్రకటించారు. ఆర్నెళ్ల ముందే విడుదల విషయంలో క్లారిటీ ఉన్నప్పుడు… షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్, డబ్బింగ్ పనులు రిలీజ్ కి వారానికి ముందు పూర్తి చెయ్యలేకపోవడం అంటే ఇదేమి ప్రొఫెషనలిజమో!
తెలుగులో ‘వారసుడు’ ఎలా ఆడినా… తమిళ్ లో పెద్ద హిట్ కావాలి. ఎందుకంటే, దిల్ రాజుకి తమిళ్ మార్కెట్ లో గ్రిప్ రావాలన్నా, విజయ్ ముందు తన పరువు నిలవాలన్నా ఇది జరగాలి. అందుకే, ఆయన తమిళ విడుదలపై ఎక్కువ ఫోకస్ పెట్టినట్లు ఉన్నారు.