నష్టమే ఎక్కువ: నిర్మాత దిల్ రాజు

తెలుగు సినిమాలు థియేటర్లలో ఆడట్లేదు. “ఆర్ ఆర్ ఆర్”, “కేజీఎఫ్ 2”, “విక్రమ్” వంటి యాక్షన్ ఓరియెంటెడ్ చిత్రాలు తప్ప మిగతావేవీ పెద్దగా ఆడలేదు. “ఓటిటి” సంస్థల నుంచి డబ్బులు ఎక్కువ వస్తున్నాయనే ఆలోచనతో మొదట్లో నిర్మాతలు ఎడాపెడా అమ్మేశారు. రెండు, మూడు వారాల్లోనే ఓటిటిల్లో వస్తున్నాయి కదా అని ప్రేక్షకులు సాదాసీదా సినిమాల కోసం థియేటర్ల వైపు చూడడం లేదు.

తెలుగులో కన్నా హిందీలో ఈ సమస్య ఎక్కువగా ఉంది. దిల్ రాజు నిర్మించిన రెండు హిందీ చిత్రాలు ఢమాల్. షాహిద్ కపూర్ నటించిన “జెర్సీ” సినిమాతో ఆయన భారీగా నష్టపోవాల్సి వచ్చింది. తాజాగా రాజ్ కుమార్ రావు నటించిన “హిట్” సినిమా గత శుక్రవారం థియేటర్లలోకి వచ్చింది. మొదటి నాలుగు రోజులకు 6 కోట్లు మాత్రమే సంపాదించింది. ఇక పెద్దగా వచ్చేదేమి లేదు. ఇలా దిల్ రాజు హిందీలో వరుసగా రెండు సినిమాలతో నష్టాలు చూశారు.

తెలుగులో కూడా ఈ సమస్య పెరుగుతోంది. “ఓటీటీల వల్ల నిర్మాతలకు లాభం తక్కువ. నష్టం ఎక్కువ. ఓటీటీలో విడుదలైన ఒక సినిమా సూపర్‌హిట్‌ అయినా నిర్మాతలకు ఒనగూరే ప్రయోజనం స్వల్పం. అదే సినిమా థియేటర్లలో రిలీజ్‌ అయితే వచ్చే లాభాలు, ఆనందం మామూలుగా ఉండదు. ఒటిటి వల్ల తాత్కాలిక లాభం ఉంటుంది. కానీ థియేటర్లలో ఒక సినిమా హిట్ అయితే వచ్చే క్రేజ్, రేంజ్ వేరు,” అని దిల్ రాజు చెప్తున్నారు.

ఆగస్టులోపు అన్ని సమస్యలకు ఒక పరిష్కారం కనుక్కుంటాం అని ఆయన అంటున్నారు.

 

More

Related Stories