ఎప్పుడూ కూల్ గా ఉండే దిల్ రాజుకి కోపం వచ్చింది. ముఖ్యంగా తనని అదేపనిగా టార్గెట్ చేసే ఒకట్రెండు మీడియా వెబ్ సైట్లు, అందులో పనిచేసే జర్నలిస్టులను ఉద్దేశించి దిల్ రాజు హెచ్చరిక చేశారు. ఒక పెద్ద నిర్మాణ సంస్థ ఏదైనా ఒక సినిమా డిస్ట్రిబ్యూట్ చేస్తే ఆ సంస్థకి వకాల్తా పుచ్చుకొని దిల్ రాజు మీద బురద జల్లే కొందరు జర్నలిస్ట్ లని దృష్టిలో పెట్టుకొని ఆయన ఈ కామెంట్లు చేశారని అంటున్నారు.
“ప్రతి సంక్రాంతి సమయంలో ఒకట్రెండు వెబ్ సైట్లు నన్ను బద్ నామ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటివరకు ఊరుకున్నాను. సైలెంట్ గా ఉంటే అలుసు తీసుకుంటాను అంటే ఊరుకోను. ఇకప తాట తీస్తాను. నేను ఒక డబ్బింగ్ సినిమాని విడుదల చేస్తున్నట్లు ప్రచారం చేస్తున్నారు. దమ్ముంటే నేను ఆ సినిమాని సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్లు ప్రూవ్ చెయ్యాలి,” అని దిల్ రాజు ఘాటుగా స్పందించారు.
“హనుమాన్” అనే చిన్న చిత్రానికి నైజాంలో తక్కువ థియేటర్లు లభించాయి. దీనికి కారణం దిల్ రాజు అనేది ఆరోపణ. ఐతే నాలుగు సినిమాలు విడుదల అవుటున్న టైంలో అన్ని చిత్రాలకు వాటికున్న స్థాయిని బట్టి థియేటర్లు అడ్జెస్ట్ చేసేందుకు తాను, ఇతర నిర్మాతలు కలిసి ప్రయత్నాలు చేస్తుంటే తనని టార్గెట్ చేస్తూ అదేపనిగా మీడియాలోని ఒక వర్గం బురద జల్లుతోంది అనేది దిల్ రాజు మాట.
మెగాస్టార్ చిరంజీవి నిన్న “హను మాన్” ఫంక్షన్ లో మాట్లాడిన వ్యాఖ్యలను కూడా వక్రీకరించారు అని దిల్ రాజు అంటున్నారు.