దేవా X విష్ణు: కాపీరైట్ ఫైట్

Deva Katta Vs Vishnu Induri

ఒకరి సినిమాలు మరొకరి చేతికి వెళ్లడం రొటీన్. ఇలాంటివి రెగ్యులర్ గా జరిగేవే. కానీ ఒకరు రాసుకున్న కథను, పర్మిషన్ లేకుండా మరొకరు సినిమాగా తీస్తే ఎలా ఉంటుంది? దీన్నే ఇంగ్లిష్ లో plagiarism అని, తెలుగులో గ్రంథచౌర్యం అని అంటారు. మనకు అర్థమైన భాషలో చెప్పుకోవాలంటే ఒకరి ఐడియాను మరొకరు దొంగిలించి (కాపీ చేసి) సినిమా తీసేయడం అన్నమాట. సరిగ్గా ఇప్పుడిలాంటి గొడవే ఇద్దరు వ్యక్తుల మధ్య జరుగుతోంది.

సరిగ్గా 24 గంటల కిందట వైఎస్ఆర్-చంద్రబాబు అనుబంధంపై ఓ బయోపిక్ ప్రకటించారు నిర్మాత విష్ణు ఇందూరి. సరిగ్గా ఈ ప్రకటన వెలువడిన కొన్ని గంటలకే దర్శకుడు దేవకట్టా ఫైర్ అయ్యాడు. అది తన కాన్సెప్ట్ అని, 2017లోనే, “గాడ్ ఫాదర్” స్పూర్తితో 3 భాగాల కథ రాసుకున్నానని ఆరోపించాడు. అంతేకాదు.. రీసెంట్ గా దాన్ని వెబ్ సిరీస్ ఫార్మాట్ లోకి కూడా మార్చి, రిజిస్టర్ కూడా చేయించి, ఓటీటీలతో సంప్రదింపులు జరుపుతున్న వేళ.. ఇలా విష్ణు ఇందూరి సడెన్ గా ఆ సిరీస్ ను ప్రకటించేశాడని ఆరోపిస్తున్నాడు దేవకట్టా.

ఇదే టైమ్ లో విష్ణు ఇందూరిపై మరో నింద కూడా వేశాడు. గతంలో ఇదే విష్ణు ఇందూరి అనే వ్యక్తి తన నుంచి 2015లో ఓ బయోపిక్ కాన్సెప్ట్ దొంగిలించి, ఓ డిజాస్టర్ మూవీ తీశాడని కూడా చెప్పుకొచ్చాడు. అదే ఎన్టీఆర్ బయోపిక్ అనే విషయాన్ని బయటపెట్టాడు.

దీంతో విష్ణు ఇందూరి సీన్ లోకి వచ్చాడు. ఓ రీమేక్ కాన్సెప్ట్ తో దేవకట్టాను కలిశానని, అదే టైమ్ లో ఎన్టీఆర్ బయోపిక్ ఆలోచనను బేసిక్ స్క్రీన్ ప్లేతో అతడికి నెరేట్ చేశానని చెప్పుకొచ్చాడు. అంతేతప్ప, ఆ బయోపిక్ కోసం దేవకట్టా తనకు ఎలాంటి రాత సహకారం అందించలేదని ఆరోపించాడు.

ఈ ఆరోపణ వచ్చిన కొద్దిసేపటికే దేవకట్టా మరింత ఘాటుగా రియాక్ట్ అయ్యాడు. 2015లో జరిగిన మీటింగ్ లో ఎన్టీఆర్ బయోపిక్ కు సంబంధించి విష్ణు ఇందూరి ఒక్క లైన్ కూడా రాయలేదని, కానీ అదే మీటింగ్ లో బయోపిక్ కు సంబంధించి తను 40 సీన్లు రాసినట్టు క్లెయిమ్ చేసుకున్నాడు. అక్కడితో ఆగకుండా విష్ణు ఇందూరిని అబద్ధాలకోరు అనే అర్థం వచ్చేలా మరో పెద్ద పోస్ట్ పెట్టాడు. విష్ణు ఇందూరి అబద్దాలు ఇండస్ట్రీలో అందరికి తెలుసు అని… ఎవరిని అడిగినా చిట్టా విప్పుతారని అన్నాడు దేవా కట్ట.

టాలీవుడ్ లో ఫ్రెష్ గా స్టార్ట్ అయిన ఈ కాపీరైట్ పోరు ఏ మలుపు తీసుకుంటుందో చూడాలి.

Related Stories