‘పిండం’ మరో ఎత్తు : సాయి కిరణ్

- Advertisement -
Pindam director Sai Kiran

శ్రీరామ్, ఖుషీ రవి జంటగా నటించిన చిత్రం ‘పిండం’. ఈ సినిమా డిసెంబర్ 15న విడుదల కానుంది. ఈ సినిమాకి దర్శకుడు సాయికిరణ్ దైదా. “నల్గొండ జిల్లాలో ఒక ఘటన జరిగింది. అది మా నాయనమ్మ చెప్పడం వల్ల నాకు బాగా గుర్తుండిపోయింది. దాని చుట్టూ కథ అల్లుకొని, ఎలాంటి సినిమా తీస్తే బాగుంటుందని ఆలోచించాను. దీనిని హారర్ జానర్ లో చెప్తే బాగుంటుంది అనే ఆలోచనతో పిండం సినిమా మొదలుపెట్టాను. యదార్థ ఘటన చుట్టూ కల్పిత కథ అల్లుకోవటం జరిగింది,” అని దర్శకుడు సినిమా కథకి ప్రేరణ ఎక్కడి నుంచి వచ్చిందో తెలిపారు.

“పిండం అంటే రెండు అర్థాలు ఉన్నాయి. కడుపులో బిడ్డ పెరుగుతున్నప్పుడు పిండాకారం అంటారు. అలాగే ఒక మనిషి చనిపోయాక పెట్టేది కూడా పిండం అనే అంటాం. అసలు అది ఏంటి అనేది సినిమా చూస్తే తెలుస్తుంది. ఎందుకంటే కథలో కోర్ పాయింట్ అదే,” అని టైటిల్ వెనుక కథ చెప్పారు.

“నల్గొండ ఘటన గురించి ఇప్పుడు మీకు చెప్పలేను. సినిమా చూశాక తెలుస్తుంది. ఆ ఘటన చుట్టూ అల్లుకున్న కల్పిత కాబట్టి, మెదక్ జిల్లాలోని శుక్లాపేట్ లో జరిగినట్లుగా సినిమాలో చూపించాం,” అని వివరణ ఇచ్చారు దర్శకుడు సాయికిరణ్ దైదా.

“చిన్నప్పటి నుండి నాకు రాయడం అంటే ఇష్టం. నాకు ఎప్పుడైతే పట్టు వచ్చింది అనిపించిందో అప్పుడు సినిమా చేయాలని నిర్ణయించుకున్నాను. ఎవరి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేయలేదు. ఇప్పటిదాకా తెలుగులో వచ్చిన హారర్ సినిమాలన్నీ ఒక ఎత్తు. మా పిండం సినిమా వాటికి పూర్తి భిన్నంగా ఉంటుంది. ఏదో భయపెట్టాలని ఒక హారర్ సీన్ పెట్టడం అలా ఉండదు. బలమైన కథ ఉంటుంది. స్క్రీన్ కి అతుక్కొని మరీ చూస్తారు,” అని చెప్తున్నారు దర్శకుడు.

త్వరలోనే “కృష్ణుడి లంక” అనే క్రైమ్ కామెడీ సినిమా చేయబోతున్నాను అని తెలిపారు.

 

More

Related Stories