
దేశంలో ఎక్కడ ఏ సంచలన విషయం జరిగినా దానిపై సినిమా ప్రకటిస్తుంటాడు వర్మ. అలా ప్రకటించిన వాటిలో కొన్ని తీస్తుంటాడు, మరికొన్ని పక్కనపెడతుంటాడు. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హైదరాబాద్ కు చెందిన దిశ రేప్-మర్డర్ కేసుపై కూడా ఈ మధ్య సినిమా ప్రకటించాడు. రాదనుకున్న ఆ సినిమాను రెడీ చేశాడు. ఈరోజు ట్రయిలర్ విడుదల చేశాడు.
ఔటర్ రింగు రోడ్డుపై నలుగురు దుర్మార్గులు, దిశను సామూహితంగా అత్యాచారం చేసి.. అండర్ బ్రిడ్జి కింద పాశవికంగా తగలబెట్టిన ఆ ఘటనను ట్రయిలర్ లో కళ్లకు కట్టినట్టు చూపించారు. ఈ ఘటనలో దోషులంతా ఎన్ కౌంటర్ అయిన విషయం తెలిసిందే. ఆ ఎన్ కౌంటర్ అంశాన్ని మాత్రం ట్రయిలర్ లో సస్పెన్స్ లో ఉంచారు.
“దిశ” టైటిల్ తోనే తెరకెక్కిన ఈ సినిమాలో దిశ పాత్రలో సోనియా ఆకుల నటించింది. ఎప్పట్లానే ఈ సినిమాకు కూడా “ఎ రామ్ గోపాల్ వర్మ ఫిల్మ్” అనే కార్డు వేసుకున్న ఆర్జీవీ.. దర్శకుడిగా ఆనంద్ చంద్రను పరిచయం చేస్తున్నాడు. ఎప్పట్లానే ట్రయిలర్ లో వర్మ మార్క్ కెమెరా యాంగిల్స్, అతడి మార్క్ డైరక్షన్ కనిపించింది.
దిశ హత్య జరిగి నవంబర్ 26కు సరిగ్గా ఏడాది అవుతుంది. ఈ “దిశ” సినిమాను అదే రోజు విడుదల చేస్తామని ప్రకటించాడు వర్మ.