
హృతిక్ రోషన్ ఇటీవల ఒక సినిమాలో నటించారు. ఆ సినిమా పేరు “ఫైటర్.” ఈ సినిమా బాలాకోట్ దాడుల నేపథ్యంగా సాగింది. ఆ సినిమాలో హృతిక్ రోషన్ భారతీయ వైమానిక సైనికుడిగా నటించారు. జెట్ యుద్ధ విమానాలు నడిపే పైలట్ సైనికుడిగా హృతిక్ రోషన్ అదరగొట్టాడు.
ఐతే, ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించలేదు. ఇప్పుడు మన తెలుగు హీరో వరుణ్ తేజ్ అచ్ఛంగా అలాంటి సినిమా, అలాంటి పాత్ర చేస్తున్నాడు. “ఆపరేషన్ వాలెంటైన్” అనే చిత్రంలో వరుణ్ తేజ్ సైనిక పైలట్ గా నటించాడు. ఐతే హృతిక్ రోషన్ తో తనని పోల్చి చూడొద్దని వరుణ్ తేజ్ అంటున్నారు.
“ఫైటర్, ఆఫరేషన్ వాలంటైన్ చిత్రాల నేపథ్యం ఒకటే కావొచ్చు కానీ కథలు వేరు, కథనాలు వేరు. ఈ సినిమాలో బాలాకోట్ దాడుల గురించి ఉంది కానీ ఇది ప్రధానంగా మన వైమానిక సైనికుల జీవితాలను చూపించే చిత్రం. మన సైనికుల సాహసం, వీరత్వం చూపిస్తుంది ఆపరేషన్ వాలెంటైన్. హృతిక్ రోషన్ చిత్రానికి, మా సినిమాకి సంబంధం లేదు,” అని వరుణ్ తేజ్ అన్నారు.
“ఆపరేషన్ వాలెంటైన్” కొత్త ట్రైలర్ ఈ రోజు విడుదలైంది. ఈ ట్రైలర్ తో ఈ సినిమాని మంచి అంచనాలు పెరిగాయి. మార్చి 1న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది.
“ఆఫరేషన్ వాలెంటైన్” చిత్రంతో మానుషి చిల్లర్ తెలుగు తెరకు పరిచయం అవుతోంది. ఆమె ఇంతకుముందు బాలీవుడ్లో నటించింది. పైగా అందాలపోటీల్లో విజేతగా నిలిచింది.