
ఇటీవలే వెంకటేష్ తాను నటించిన ‘నారప్ప’ సినిమాని అమెజాన్ లో విడుదల చేశారు. థియేటర్లలో విడుదల కాకుండా ఓటిటీలో విడుదలయిన పెద్ద హీరో మూవీ… నారప్ప. అదే ఊపులో “దృశ్యం 2” సినిమాని కూడా హాట్ స్టార్ కి అమ్మేశారు వెంకటేష్ నిర్మాతలు. ఇది కూడా థియేటర్లలో విడుదల కాదు.
ఐతే, అక్టోబర్ తర్వాతే హాట్ స్టార్ ఈ సినిమాని విడుదల చేస్తామని మాట ఇచ్చిందట. తెలుగు థియేటర్ల సంఘాలు గగ్గోలు పెడుతుండడంతో వెంకటేష్ ఈ సినిమా వరకు అక్టోబర్ వరకు రిలీజ్ చెయ్యొద్దని హాట్ స్టార్ కి క్లాజ్ పెట్టారట. హాట్ స్టార్ కూడా వచ్చే నెలలో నితిన్ నటించిన “మాస్ట్రో” రిలీజ్ చేసి, నెల గ్యాప్ తర్వాత “దృశ్యం 2” విడుదల చేయాలనుకుంటోంది.
“నారప్ప” సినిమాకి 36 కోట్లు చెల్లించింది అమెజాన్. “దృశ్యం 2” సినిమాకి 35 కోట్లు ఇచ్చింది హాట్ స్టార్. “టక్ జగదీష్” సినిమాకి అమెజాన్ 37 కోట్లు సమర్పించుకొంది. ఇక నితిన్ నటించిన “మాస్ట్రో”కి హాట్ స్టార్ 31 కోట్లు అందించింది.
ఇంత భారీ అమౌంట్స్ ఓటిటి సంస్థలు నుంచి వస్తుండడంతో నిర్మాతలు అటువైపు మొగ్గు చూపుతున్నారు. హిందీ డబ్బింగ్ రైట్స్, శాటిలైట్ రైట్స్, మ్యూజిక్ హక్కుల రూపంలో కూడా నిర్మాతలకు అదనంగా కోట్లల్లో డబ్బు వస్తుంది.