ఈడీ పిలుపులంటే ఇక లైట్!

కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఈడీ, సీబీఐ, ఐటీ దాడులను తన రాజకీయ ప్రత్యర్థి పార్టీ వారిపై, ప్రత్యర్థి పార్టీలతో ‘దోస్తానా’ చేస్తున్న వారిపై ఉపయోగిస్తోంది ఆరోపణలు ఎక్కువ అయ్యాయి. ఇక సినిమా వాళ్ల వైపు వస్తే… ఈడీ, ఐటీ దాడులతో ‘దారి’కి తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. బాలీవుడ్ లో జరుగుతున్న పరిణామాలు అలాగే అనిపిస్తున్నాయి.

అందుకే, ఇప్పుడు ఈడీ, సీబీఐ, ఐటీ దాడులు కానీ, విచారణకు పిలుపులు కానీ ఒక హీరోకు, హీరోయిన్ కో వచ్చాయి అంటే టార్గెట్ మరెక్కడో అని అర్థం అనుకోవాలి. హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కి ఇది కామన్ అయిపోయింది. ఆమె ఇప్పటికే హైదరాబాద్ డ్రగ్స్ కేసులో ఒకసారి ఈడీ విచారించింది. అలాగే, ముంబై లో రియా చక్రవర్తి కేసులో కూడా ఎన్సీబీ, ఈడీలు విచారించాయి.

ఇప్పుడు మరోసారి హైదరాబాద్ డ్రగ్స్ కేసు గురించి ఈడీ నుంచి రకుల్ కి పిలుపు వచ్చింది. టీఆర్ ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డిని కూడా విచారణకు పిలిచింది ఈడీ. టీఆర్ ఎస్ ని టార్గెట్ చేసిన బీజేపీ ప్రభుత్వం మరోసారి రకుల్ ని పిలిచినట్లు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

ఏది ఏమైనా, రకుల్ మాత్రం భయపడకుండా తన పని చేసుకుపోతోంది. ఆమె ఎప్పటిలాగే ఇన్ స్టాగ్రామ్ లో తన ఫోటోలు షేర్ చేసుకుంటూ బిజీగా ఉంది. మీడియాలో కూడా ఇప్పుడు ఈడీ పిలుపుల వార్తలకు హడావిడి తగ్గిపోతోంది. ఇప్పటికే రకుల్ ని రెండు సార్లు పిలిచారు కాబట్టి ప్రాధాన్యం పోయింది.

 

More

Related Stories