ఎఫ్3 మూవీ – తెలుగు రివ్యూ

ఎఫ్2 సినిమా పెద్ద హిట్టయింది. దీంతో ఎఫ్3పై అంచనాలు పెరిగాయి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నవ్వుకోవచ్చని యూనిట్ ఊరించింది. నవ్వుకునే టైమ్ లోనే మరో కామెడీ పంచ్ మిస్ అవుతారంటూ అంచనాల్ని మరింత పెంచింది. అయితే ఎఫ్3లో అంత లేదు. ఇది కామెడీ సినిమానే. నవ్వుకునే సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. అయితే బ్యాక్ టు బ్యాక్ పంచ్ లు మాత్రం కనిపించవు. ఇంకా చెప్పాలంటే ఈ సినిమా స్టార్టింగ్ లో నవ్వుకునే సందర్భాలు చాలా తక్కువ. పాత్రల పరిచయానికి, ఎఫ్2 తో పోలిస్తే, ఆ పాత్రలు ఎంత విభిన్నం అని చెప్పడానికే రావిపూడి చాలా టైమ్ తీసుకున్నాడు. దీంతో ప్రారంభంలో నవ్వులు మిస్సయ్యాయి. ఫస్టాఫ్ పై ప్రేక్షకులు పెదవి విరచడానికి ఇదే ప్రధాన కారణం.

అయితే ఎప్పుడైతే పాత్రల పరిచయం పూర్తయి, ప్రేక్షకులకు ఓ క్లారిటీ ఇచ్చేశాడో, ఇక అక్కడ్నుంచి దర్శకుడు తన అమ్ములపొది లోంచి ఒక్కో అస్త్రం తీయడం మొదలుపెట్టాడు. “వెంకట్రావ్ పెళ్లాన్ని నేను చూశాను” అనే కామెడీ ట్రాక్ నుంచి మొదలుపెట్టి వరుసపెట్టి కామెడీ ఎపిసోడ్లు బ్యాక్ టు బ్యాక్ ప్రేక్షకుల్ని నవ్విస్తాయి. షాకింగ్ న్యూస్ వచ్చినప్పుడు ఫిట్స్ వచ్చి పడిపోయే ఎపిసోడ్స్ ను ‘అమ్మో ఒకటో తారీఖు’ సినిమా నుంచి లేపేసినప్పటికీ.. దాన్ని రావిపూడి సినిమా మొత్తం తనదైన స్టయిల్ లో మలిచిన విధానం బాగుంది.

కథగా చెప్పుకుంటే ఇందులో ఏం లేదు. ఇంకా చెప్పాలంటే పాత చింతకాయ పచ్చడి స్టోరీ ఇది. ఆ ఒక్కటి అడక్కు సినిమా నుంచి చాలా సినిమాల్ని ఈ కథలోకి ఇరికించేశాడు దర్శకుడు. కష్టపడకుండా అమాంతం డబ్బులు సంపాదించాలనుకునే బ్యాచ్ స్టోరీ ఇది. వెంకీ ఆర్టీవో ఆఫీస్ లో బ్రోకర్. అతడ్ని హనీ (మెహ్రీన్), హారిక (తమన్న) కుటుంబం పదేపదే మోసం చేస్తుంది. మరోవైపు వరుణ్ కూడా ఇదే కుటుంబం చేతిలో మోసపోతాడు. మరోవైపు తన కొడుకు తప్పిపోయాడని ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ ప్రసాద్ (మురళీశర్మ) ప్రకటన చూసి, అతడి దగ్గర నుంచి ఆస్తిని కాజేసేందుకు ఈ బ్యాచ్ మొత్తం ఆ ఇంట్లో చేరుతుంది. అక్కడ్నుంచి కథ ఎలా సుఖాంతం అయిందనేది ఈ సినిమా స్టోరీ.

కామెడీ పండించాలంటే కొన్ని లాజిక్కులు మరిచిపోవాల్సిందే. ఈ విషయంలో అనీల్ రావిపూడి తన మైండ్ లోకి లాజిక్ అనే పదం కూడా రానివ్వలేదనే విషయం సినిమా చూస్తే అర్థమౌతుంది ప్రేక్షకుడు కూడా ఈ సినిమాలో లాజిక్కులు వెదక్కుండా, ఫ్లోలో కామెడీ సీన్లు చూసి ఎంజాయ్ చేయాలి, ఒక్కసారి మైండ్ లాజిక్ వైపు వెళ్లిందంటే సినిమా నచ్చదంతే.

కామెడీ పండించడం కోసం రావిపూడి పెట్టిన ప్యాడింగ్ మొత్తం సక్సెస్ అయింది. వెంకీ పక్కన రఘుబాబు, వరుణ్ తేజ్ పక్కన సునీల్ సరిగ్గా సరిపోయారు. అలీ, రాజేంద్రప్రసాద్ ట్రాక్స్ కూడా బాగా పండాయి. రేచీకటి ఉన్న వ్యక్తిగా వెంకటేష్ మరోసారి పెర్ఫార్మెన్స్ చించేశాడు. అతడి కామెడీ టైమింగ్ కు జోహార్లు. వరుణ్ తేజ్ లో కూడా ఈసారి మరింత ఈజ్ కనిపించింది. మెహ్రీన్, తమన్న కామెడీ పంచ్ లతోనే కాదు.. చిన్న చిన్న బట్టలతో కూడా ఆకట్టుకున్నారు. వీళ్లకు పూజాహెగ్డే, సోనాల్ కూడా యాడ్ అవ్వడంతో.. కామెడీకి గ్లామర్ బోనస్ గా మారింది. దేవిశ్రీప్రసాద్ పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగున్నాయి. కెమెరావర్క్, ఎడిటింగ్ సింక్ లో ఉన్నాయి.

ప్రీ-క్లైమాక్స్, క్లయిమాక్స్ లో అనీల్ రావిపూడి చమక్కులు కనిపిస్తాయి. వెంకీని నారప్పగా, వరుణ్ తేజ్ ను వకీల్ సాబ్ గా చూపించడం.. ప్రేక్షకులపై ఓటీటీ ప్రభావం లాంటి అంశాల్ని కామెడీగా చక్కగా ఇరికించేశాడు ఈ దర్శకుడు. ఎఫ్2లో పెట్టినట్టుగానే, ఎఫ్3లో కూడా వెంకీ, తన సెంటిమెంట్ తో ఎద్దును కూడా కరిగించడం మరో హైలెట్ గా చెప్పుకోవాలి.

బాటమ్ లైన్
ఓవరాల్ గా చూసుకుంటే కాస్త డల్ గా ప్రారంభమైన ఎఫ్3 సినిమా క్లయిమాక్స్ పూర్తయ్యేసరికి ప్రేక్షకుడికి కావాల్సినంత వినోదాన్ని అందిస్తుంది. పగలబడి నవ్వేలా 3-4 ఎపిసోడ్స్ ఉన్నాయి. పూర్తిగా కామెడీ అందించే ఉద్దేశంతో తీసిన ఈ సినిమాలో లాజిక్కులు, కథ, ఎమోషన్స్ లాంటివి పట్టించుకోకూడదు. అప్పుడు మాత్రమే సినిమాను ఎంజాయ్ చేస్తారు.

Rating: 3/5

Review By – పంచ్ పట్నాయక్

 

More

Related Stories