ఇక్కడిలా అక్కడ చేయొద్దు!

Veera Simha Reddy

మనవాళ్లకు కొన్ని బుద్దులు మారవు. ఎక్కడికి వెళ్లినా సినిమా థియేటర్లో ఈలలు, డ్యాన్స్ లు చేస్తుంటారు. అది కొంతవరకు ఓకే. కానీ పేపర్లు విసరడం, సీట్లు చింపడం, సీట్లు ఇరగొట్టడం వంటి శృతి మించిన పనులకు కూడా పాల్పడుతుంటారు. ఇండియాలో ఇప్పటికే కొన్ని మల్టీప్లెక్స్ లు ఇలాంటి చేష్టలను నిషేధించాయి. అలాంటి పనులు చేసిన అభిమానులను బయటికి పంపిస్తున్నాయి. ఐతే, అమెరికా వెళ్లినా మనవాళ్ల పద్దతి మారడం లేదు.

నిన్న అమెరికాలోని ఒక నగరంలో బాలయ్య అభిమానులు ‘వీర సింహా రెడ్డి’ థియేటర్ల వద్ద హంగామా చేశారు. విరగబడి ఫ్యాన్స్ వచ్చారు. బాలయ్య కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు వచ్చాయి ప్రీమియర్ షోకి.

ఐతే, థియేటర్ లో పేపర్లు చింపి విసిరి, నానా అల్లరి చేయడంతో ఆ థియేటర్ మేనేజర్ సినిమాని నిలిపివేశాడు. అంతేకాదు, వెంటనే పోలీస్ అధికారిని పిలిచి అందర్నీ బయటికి పంపించేశాడు. అంటే, సినిమా పూర్తి కాకముందే అందరూ ఇంటికి వెళ్లాల్సి
వచ్చింది.

ఇలాంటి చేష్టలు చేసి ఇండియాకి చెడ్డ పేరు తేవద్దు. ఇండియన్స్ పై ఇప్పటికే అక్కడ చాలా మంది అమెరికన్లు గుర్రుగా ఉన్నారు. సెలెబ్రేషన్స్ స్థానిక పద్ధతులు, చట్టాలకు తగ్గట్లుగా ఉండాలి.

 

More

Related Stories