గాండీవధారి అర్జున – మూవీ రివ్యూ

Gandeevadhari Arjuna

ప్రవీణ్ సత్తారు.. సినిమాల్ని స్టయిలిష్ గా తీస్తాడనే పేరుంది. ఆ పేరును నిలబెట్టుకోవడం కోసం “గాండీవధారి అర్జున” సినిమాలో కథని వదిలేసి యాక్షన్ పై ఫోకస్ పెట్టారు సత్తారు. ఈ సినిమా స్టయిలిష్ గా కనిపిస్తూనే బోర్ కొట్టిస్తుంది. నిజానికి ప్రవీణ్ లో ఉన్న ఈ లోపాన్ని ‘ది ఘోస్ట్’ సినిమా ఎప్పుడో ఎత్తిచూపింది. నాగార్జున హీరోగా నటించిన ఆ సినిమా కూడా స్టయిల్ గా ఉంటుంది కానీ నెరేషన్ లో బోర్ కొట్టిస్తుంది. ఇప్పుడు “గాండీవధారి అర్జున” సినిమాలో కూడా సేమ్ మిస్టేక్ రిపీట్ అయింది.

ఇంతకీ కథ ఏంటంటే.. మాజీ ఆర్మీ ఆఫీసర్ అర్జున్ (వరుణ్ తేజ్), తల్లిని తీసుకొని ట్రీట్ మెంట్ కోసం లండన్ వెళ్తాడు. అదే టైమ్ లో ఐక్యరాజ్య సమితి సమావేశంలో పాల్గొనేందుకు ఇండియా నుంచి లండన్ వస్తారు కేంద్ర మంత్రి ఆదిత్య (నాజర్). మంత్రికి రక్షణ కల్పించే ప్రైవేట్ ఏజెంట్ గా రంగంలోకి దిగుతాడు అర్జున్.

మంత్రిని, ఓ మల్టీ నేషనల్ కంపెనీ యజమాని టార్గెట్ చేస్తాడు. తమ కంపెనీకి అనుకూలంగా డాక్యుమెంట్ పై సంతకం చేయమని బెదిరిస్తాడు. అసలు మంత్రిని ఎందుకు టార్గెట్ చేశారు? అర్జున్, మంత్రిని కాపాడగలిగాడా లేదా? వీళ్లిద్దరి మధ్యలో ఉన్న మరో పాత్రధారి ఐరా (సాక్షి వైద్య)కు, అర్జున్ కు ఏంటి సంబంధం?

ఇంతకుముందే చెప్పుకున్నట్టు ప్రవీణ్ సత్తారు ఇటీవల స్టయిలింగ్ పై పెట్టిన ఫోకస్ ను రైటింగ్ పై పెట్టడం లేదు. యాక్షన్ మూవీస్ లో కానీ, స్పై మూవీస్ లో కానీ కథ కన్నా ఎంత గ్రిప్పింగ్ గా చెప్పామనేది ముఖ్యం. అది “గాండీవధారి అర్జున”లో పూర్తిగా మిస్సయింది.

ధనిక దేశాలన్నీ తమ దేశంలో ఉన్న వ్యర్థాల్ని, అభివృద్ధి చెందుతున్న దేశాలకు డంప్ చేస్తున్నాయి. దాని వల్ల ఆయా దేశాల్లో పేదలు ప్రాణాలు కోల్పోవల్సి వస్తోంది. ఆరోగ్యాలు పాడు అవుతున్నాయి. ఈ విషయాన్ని చెప్పాలనుకున్నాడు దర్శకుడు. హీరో తల్లికి ఆరోగ్యం పాడు అయింది ఇలాగే అని చూపించాడు దర్శకుడు. కానీ ఈ సమస్యను పూర్తిస్థాయిలో చెప్పాలా లేక టచ్ చేసి వదిలేయాలా అనే మీమాంస సినిమా మొత్తం కనిపించింది. పైగా ఆ సమస్యకి, తీసుకున్న యాక్షన్ జాన్రాకి లింక్ కుదరలేదు. అందుకే, రెండు గంటల 10 నిమిషాల సినిమా చాలా నీరసంగా, పేలవంగా సాగినట్లు అనిపిస్తుంది.

రైటింగ్ లో ప్రధాన లోపం ఇదే. కథలో కొత్తదనం లేదు దమ్ము లేనప్పుడు క్యారెక్టరైజేష్లు బలంగా ఉండేలా చూసుకోవాలి. “గాండీవధారి అర్జున” సినిమాలో ఆ ప్రయత్నం కూడా జరగలేదు. ఉన్నంతలో వరుణ్ తేజ్ తన పాత్రకు బాగా సూట్ అయ్యాడు. అయితే ఇక్కడ కూడా కన్ఫ్యూజన్. అతడు గూఢచారా లేక బాడీగార్డా అనే అనుమానం జనాలకు కలుగుతూనే ఉంటుంది. అసలు ఒక దేశ మంత్రి వేరే దేశంలో ప్రైవేట్ ఏజెంట్ ని ఎందుకు సెక్యూరిటీగా పెట్టుకుంటాడు. ఐక్యరాజ్యసమితి సమావేశాలకు వెళ్లిన వారికి అక్కడి దేశమే రక్షణ కలిస్తుంది కదా. లేదంటే భారత దౌత్య కార్యాలయం ఆ పనులు చూస్తుంది. ఇలాంటి విషయాలను, లాజిక్ లను పక్కన పెట్టిన హీరో చేస్తున్న పనిలో ఎక్కడా థ్రిల్ అనిపించదు.

నాజర్ డీసెంట్ గా చేశాడు. సాక్షి వైద్య చూడ్డానికి బాగుంది. యాక్టింగ్ పరంగా ఆమె చాలా నేర్చుకోవాలి. విమలా రామన్, వినయ్ రాయ్ ల పాత్రలు కూడా బలంగా లేవు. అభినవ్ గోమఠం పాత్ర వృధా. టెక్నికల్ గా చెప్పుకోవాలంటే, సినిమాలో ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. ఖర్చుకు వెనకాడకుండా రిచ్ గా తీశారు. ముఖేష్ సినిమాటోగ్రఫీ బాగుంది. కానీ కథ-కథనంలో లోపాల వల్ల వీటిని థియేటర్ లో ఎంజాయ్ చేయలేం.

ఓవరాల్ గా.. “గాండీవధారి అర్జున” సినిమా స్టయిల్ గా కనిపిస్తూ బోర్ కొడుతుంది. నిడివి తక్కువే ఉన్నా పెద్ద సినిమా చూశాము అన్న భావన వచ్చిందంటే సినిమాలో “మేటర్” లేదు అని అర్థం.

బాటమ్ లైన్: గాండీవం గురి తప్పింది

Rating: 2/5

By M Patnaik

Advertisement
 

More

Related Stories