
హా…హా… హాసిని జెనిలియా హీరోయిన్ గా నటించడం మానేసి దశాబ్దంపైనే అయింది. ఆమె ఇప్పుడు ఇద్దరు పిల్లల తల్లి. దాదాపు పదేళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత ఆమె మళ్ళీ మేకప్ వేసుకుంటోంది. రీఎంట్రీలో కళ్ళు చెదిరే పారితోషికం అందుకోనుండడం విశేషం.
ఆమె హీరోయిన్ గా తీసుకున్న అత్యధిక పారితోషికం 70 లక్షలు. ఇప్పుడు ఆమె ఒక కొత్త సినిమాలో హీరోకి అక్కగా నటిస్తోంది. ఈ పాత్రకి ఆమె మూడు కోట్లు డిమాండ్ చేసిందట. నిర్మాత కళ్ళు మూసుకొని ఒప్పుకున్నారట. ఎందుకంటే, ఈ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నది ఎవరో కాదు గాలి కిరీటి.
ప్రముఖ వ్యాపారవేత్త, వివాదాస్పద రాజకీయ నాయకుడు గాలి జనార్దన్ రెడ్డి కుమారుడే కిరిటీ. తన కూతురు పెళ్ళికి దాదాపు 500 కోట్లు ఖర్చు పెట్టారు గాలి జనార్దన్ రెడ్డి. ఇప్పుడు కొడుకు సినిమాకి భారీ నటీనటుల సహకారం, సాంకేతిక నిపుణుల తోడు ఉండేలా ప్లాన్ చేశారు. ఈ రోజు (మార్చి 4న) లాంఛనంగా ఈ సినిమా ప్రారంభం అయింది. ‘బాహుబలి’ కెమెరామెన్ సెంథిల్, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్, ఆర్ట్ డైరెక్టర్ రవీందర్ వంటి పేరొందిన టెక్నీషియన్లు ఈ సినిమాకి పని చేస్తున్నారు.
ఇక సినిమాలో కీలకమైన అక్క పాత్రకి జెనిలియాని ఒప్పించారు. ఆమె 3 కోట్ల డిమాండ్ చెయ్యగానే ఓకే చెప్పారట నిర్మాత సాయి కొర్రెపాటి. ఆఫ్ కోర్స్, అసలు డబ్బు అంతా గాలి జనార్దన్ రెడ్డిదే.
మొత్తానికి జెనిలియా రెండో ఇన్నింగ్స్ లో పారితోషికం ప్రకారం ఒక కొత్త రికార్డు సెట్ చేసింది.