
మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘గాడ్ ఫాదర్’ అక్టోబర్ 5న దసరా కానుకగా విడుదల కానుంది. ఇందులో సల్మాన్ ఖాన్ కూడా నటించడం విశేషం. ఈ సినిమా మలయాళంలో సూపర్ హిట్టైన ‘లూసిఫర్’ సినిమాకి రీమేక్. దర్శకుడు మోహన్ రాజాతో చిట్ చాట్.
గాడ్ ఫాదర్ అవకాశం ఎలా వచ్చింది ?
ధ్రువ -2 తీయాలని పిలిపించారు. ఆ చర్చల సందర్భంలో ‘లూసిఫర్’ ప్రస్తావన వచ్చింది. లూసిఫర్ ని చూశాను. అందులో నాకు ఒక కొత్త కోణం దొరికింది. దాంతో నన్నే డైరెక్ట్ చెయ్యమన్నారు.
ఏమిటా కోణం? ఏమి మార్పులు చేశారు?
కథని అలానే ఉంచాం. స్క్రీన్ ప్లే కొత్తగా చేశాను. మలయాళంలో లేని పది పాత్రలు వుంటాయి. ఈ పాత్రలు చాలా సర్ ప్రైజింగ్ గా ఉంటాయి. లూసిఫర్ లో మోహన్ లాల్ గారు 50 నిమిషాలు మాత్రమే కనిపిస్తారు. “గాడ్ ఫాదర్”లో చిరంజీవి గారు 2 ఉంటారు.
ఒరిజినల్ చూసిన వాళ్ళకి నచ్చుతుందా?
కావాలంటే మళ్ళీ ఫ్రెష్ గా “లూసిఫర్” చూసి “గాడ్ ఫాదర్” థియేటర్లోకి అడుగుపెట్టండి. స్క్రీన్ ప్లే ఫ్రెష్ గా అనిపించకపోతే అడగండి.
సత్యదేవ్ ని తీసుకోవడానికి కారణం ?
అది విలన్ పాత్రే కానీ ఒక హీరో చెయ్యాల్సిన పాత్ర. సినిమా చూసిన తర్వాత చిరంజీవి గారి తర్వాత సత్యదేవ్ పాత్రే అందరికీ గుర్తుంటుంది.

సల్మాన్ ఖాన్ అతిథి పాత్ర చెయ్యడానికి కారణం?
లూసిఫర్” పృథ్విరాజ్ సుకుమారన్ చేశారు. ఆ సినిమాకి ఆయనే దర్శకుడు. పైగా అతను పెద్ద హీరో. తెలుగులో కూడా ఒక పెద్ద హీరోతోనే చేయించాలనుకున్నాం. ఐతే, చిరంజీవి కుటుంబానికి చెందిన స్టార్స్ కాకుండా వేరే పెద్ద హీరో అయితే బాగుంటుంది అని భావించాం. రామ్ చరణ్ , సల్మాన్ స్నేహితులు. చరణ్ బాబు కి చెప్పడం ఆయనే అంతా చూసుకోవడం జరిగింది. ఇద్దరి మెగా స్టార్స్ ని డైరెక్ట్ చెయ్యడం జీవితంలో మర్చిపోలేని అనుభవం. సల్మాన్ ఖాన్ గారు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు సినిమా చూసి.
గాడ్ ఫాదర్ 2 వుంటుందా ?
మలయాళంలో “లుసిఫర్ 2” మొదలైయింది. కానీ, “గాడ్ ఫాదర్ 2” గురించి ఇప్పుడే మాట్లాడడం సబబు కాదు.