గుడ్ లక్ సఖి: తెలుగు రివ్యూ

Keerthy Suresh

విమర్శకుల ప్రశంసలు అందుకున్న దర్శకుడు ఆయన. ఇంగ్లిష్ లో తీసిన ఇండియన్ డ్రామా హైదరాబాద్ బ్లూస్ తో అందర్నీ ఎట్రాక్ట్ చేసిన డైరక్టర్ తను. ఆయనే మన హైదరాబాదీ నగేష్ కుకునూర్. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఈ దర్శకుడు, నేరుగా తెలుగులో ఎంట్రీ ఇచ్చారు. అదే కీర్తిసురేష్ లీడ్ రోల్ లో “గుడ్ లక్ సఖి” అనే సినిమా.

గతంలో మంచి చిత్రాలు తీసిన దర్శకుడు కాబట్టి కచ్చితంగా సినిమా ప్రామిసింగ్ గా ఉంటుందని ఎవరైనా అనుకుంటారు. కానీ నగేష్ లాంటి దర్శకుడి నుంచి రావాల్సిన సినిమా కాదిది. సినిమాలో గొప్పగా చెప్పుకోవడానికి మచ్చుకు ఒక్క సీన్ కూడా లేదు. కుకునూర్ బ్రిలియంట్ ఫిలింమేకింగ్ లేదా స్క్రీన్ రైటింగ్ ఏదీ ఈ సఖిలో కనిపించదు. ఓ స్పోర్ట్స్ డ్రామాను ఎంత నీరసంగా తీయొచ్చో ప్రాక్టికల్ గా చూపించింది “గుడ్ లక్ సఖి” సినిమా.

“ఇక్బాల్” లాంటి స్పోర్ట్స్ డ్రామాను అద్భుతంగా తీసిన కుకునూర్ నుంచి ఇలాంటి నీరసమైన స్పోర్ట్స్ డ్రామా వచ్చిందంటే నమ్మడానికి కాస్త ఇబ్బందిగా, ఆశ్చర్యంగా ఉంటుంది. కానీ ఇది నిజం. ఈ సినిమాలో సరైన ప్లాట్ లేదు, మంచి నెరేషన్ లేదు, స్పోర్ట్స్ జానర్ లో ఉండే ఎమోషన్ బొత్తిగా లేదు. కనీసం చెప్పుకోడానికి మంచి ఎపిసోడ్స్ కూడా లేవు.

మొన్న రిలీజైన “గుడ్ లక్ సఖి” ట్రయిలర్ చూసినప్పుడే అనుమానం కలిగింది. ఇదేదో మరీ ఫ్లాట్ గా ఉందేంటి అనే ఫీలింగ్ కలిగింది. పైపెచ్చు ట్రయిలర్ లో హై-పాయింట్ కూడా లేదు. బహుశా సినిమాలో అవన్నీ దాచేశారని అనుకుంటే, ఈరోజు అదంతా భ్రమ అని తేలిపోయింది. ట్రయిలర్ ఎంత ఫ్లాట్ గా నీరసంగా ఉందో, సినిమా అంతకంటే చప్పగా ఉంది.

సినిమా స్టార్ట్ అవ్వడమే బోరింగ్ గా మొదలవుతుంది. అలా ఒక గంట నడుస్తుంది. అసలు మేటర్ ఇంటర్వెల్ తర్వాత చూపించాలని దర్శకుడు ఇలా కాలక్షేపం చేస్తున్నాడని, ఇంటర్వెల్ తర్వాత సీన్ మొత్తం మారిపోతుందని, సినిమా పరుగులు పెడుతుందని మనలో మనం అనుకుంటాం. కానీ సెకండాఫ్ మరింత దారుణం. “బ్లాండ్” అనే పదానికి పరాకాష్ట.

ఒక్క ముక్కలో చెప్పాలంటే గుడ్ లక్ సఖి అనేది తలాతోక లేని ఓ సినిమా. బ్రిలియంట్ డైరక్టర్ అనిపించుకున్న నగేష్ కుకునూర్ నుంచి ఇలాంటి సిల్లీ డ్రామా రావడం ఆశ్చర్యం కలిగిస్తుంది. కానీ అదే నిజం.

ఇక కథను కూడా 3 ముక్కల్లో చెప్పుకొని ముగిద్దాం. తెలంగాణకు చెందిన లంబాడీ పిల్ల సఖి (కీర్తిసురేష్), రాయలసీమలో సెటిల్ అవుతుంది. ఆమెను అంతా బ్యాడ్ లక్ సఖి అంటారు. గోలీలు ఆడడంలో మంచి టాలెంట్ ఉంటుంది సఖికి. ఆ విషయాన్ని ఆమె చిన్ననాటి స్నేహితుడు రాజు (ఆది పినిశెట్టి) గ్రహిస్తాడు. ఆమెను తీసుకెళ్లి షూటింగ్ కోచ్ (జగపతిబాబు)కు పరిచయం చేస్తాడు. సఖిలో టాలెంట్ గుర్తించిన కోచ్, ఆమెను షూటర్ గా తీర్చిదిద్దుతాడు. అయితే ఈ క్రమంలో కోచ్ తనను ప్రేమిస్తున్నాడని భ్రమ పడుతుంది సఖి. ఇక క్లైమాక్స్ ఏంటనేది ఎవరైనా ఊహించుకోవచ్చు.

కథ, కథనం సరిగ్గా లేకపోతే ‘మహానటి’ కూడా మూలన పడుతుందనడానికి ఈ సినిమా ఎగ్జాంపుల్. జాతీయ అవార్డ్ గ్రహీత కీర్తిసురేష్, ఉన్నంతలో ఈ సినిమాను మోయడానికి తెగ తాపత్రయపడింది. ఈ ఫ్లాట్ నెరేషన్, ఎమోషన్ లేని ఈ కథ ఆమెకు ఎలా కనెక్ట్ అయిందో ఎంత ఆలోచించినా అర్థం కాదు. ఇక కోచ్ గా జగపతిబాబు, డ్రామా ఆర్టిస్ట్ గా ఆది పినిశెట్టి “మమ” అనిపించారు.

బాటమ్ లైన్: ఇది నిజంగా “బ్యాడ్ లక్ సఖి”. తలాతోక లేని ఓ ప్రయత్నం. తీసిన నిర్మాత, చూసిన ప్రేక్షులకు బ్యాడ్ లక్.

Rating: 1.5/5

‘పంచ్’ పట్నాయక్

Advertisement
 

More

Related Stories