ఉగాదికి రావడం డౌటే

Hari Hara Veeramallu

పవన్ కల్యాణ్ నటిస్తున్న “హరిహర వీరమల్లు” ఆగుతూ సాగుతోంది….. సాగుతూ ఆగుతోంది. కరోనా రాకముందే మొదలైంది ఈ మూవీ. కరోనా నాలుగో వేవ్ తర్వాత కూడా 50 శాతం పూర్తి కాలేదు. ఎందుకంటే, పవన్ కల్యాణ్ తన రాజకీయ పార్టీ కలాపాలతో బిజీగా ఉన్నారు. దాంతో పాటు, స్క్రిప్టులు మార్పులు చేర్పుల కోసం కొంత సమయం తీసుకున్నాడు డైరెక్టర్ క్రిష్.

ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఒక పెద్ద యాత్ర కోసం సన్నాహాలు చేసుకుంటున్నారు. అటు యాత్ర, ఇటు రెండు సినిమాల షూటింగ్ లను ఆయన బ్యాలెన్స్ చేసుకోవాలి. పవన్ కళ్యాణ్ సినిమాల కన్నా పార్టీ వైపే ఎక్కువ ఫోకస్ పెడుతారు. కాబట్టి “హరిహర వీరమల్లు” షూటింగ్ ఇప్పట్లో పూర్తి అవడం కష్టం. పైగా అది పీరియడ్ మూవీ. సెట్లు, గ్రాఫిక్స్, పోస్ట్ ప్రొడక్షన్ …. ఇలా పని ఎక్కువ ఉంది. హడావిడిగా చేసేసి విడుదల చేసే సినిమా కాదు. దానికి తోడు, బడ్జెట్, ఫైనాన్స్ సమస్యలు కూడా చూసుకోవాలి.

ఇవన్నీ పరిగణనలోకి తీసుకుంటే ఈ సినిమాని ఉగాదికి విడుదల చెయ్యడం సాధ్యం కాదు. ఈ సినిమా విడుదల గురించి నిర్మాత ఏ.ఎం. రత్నం ఇటీవల ఒక ప్రకటన చేశారు. మార్చి 30, 2023న “హరి హర వీర మల్లు” సినిమాని రిలీజ్ చేస్తామని ఆయన చెప్పారు.

ఆయన ఆశ ఎలా ఉన్నా… వాస్తవ పరిస్థితులు వేరుగా ఉన్నాయి. ఈ సినిమా విడుదల, షూటింగ్ అనేది… పూర్తిగా పవన్ కళ్యాణ్ రాజకీయాలు, యాత్ర షెడ్యూల్ ని బట్టి ఉంటుంది.

దర్శకుడు క్రిష్ ఈ సినిమాని వదిలేసి ఇంకోటి చేసుకునే పరిస్థితి కూడా లేదు. “హరి హర వీర మల్లు” షూటింగ్ లో ఉండగానే “కొండపొలం” అనే సినిమా తీసి చేతులు కాల్చుకున్నారు క్రిష్. మళ్ళీ, అలాంటి తప్పు చేస్తాడనుకోలేం.

Advertisement
 

More

Related Stories