
ఒక విధంగా చెప్పాలంటే దర్శకుడు హరీష్ శంకర్ అలుపెరుగని పోరాటం చేస్తున్నట్లే. హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో సినిమా ప్రకటన వచ్చి దాదాపు మూడేళ్లు కావొస్తోంది. ఈ గ్యాప్ లో పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’ విడుదల చేశారు. ప్రస్తుతం ‘హరి హర వీర మల్లు’ షూటింగ్ లో ఉన్నారు. మరో రెండు సినిమాలు లైన్లో ఉన్నాయి.
ఐతే, హరీష్ శంకర్ సినిమా రెగ్యులర్ షూటింగ్ విషయంలో పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు క్లారిటీ ఇవ్వలేదు. నిజానికి హరీష్ శంకర్ … ఈ గ్యాప్ లో మరో సినిమా చేసుకొని రావొచ్చు. కానీ, పవన్ కళ్యాణ్ తో తాను ప్లాన్ చేసిన ‘భవదీయుడు భగత్ సింగ్’ పూర్తి చేసిన తర్వాతే మరేదైనా అని పట్టుదలగా ఉన్నారు హరీష్ శంకర్. అందుకే, ఎప్పటికప్పుడు పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్లడం, ఆ ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చెయ్యడం వంటివి చేస్తున్నారు.
హరీష్ ఇంత పట్టుదలగా ఉన్నారో తెలియక చాలా మంది రకరకాల కామెంట్స్ చేస్తున్న మాట వాస్తవం. కానీ, ఆయన కారణాలు ఆయనకున్నాయి అనేది హరీష్ శంకర్ సన్నిహితుల మాట.
ఐతే, ఈ గబ్బర్ సింగ్ దర్శకుడు ‘భగత్ సింగ్’ని ఎప్పుడు మొదలుపెట్టి, ఎప్పుడు పూర్తి చేసి విడుదల చేస్తారో అనేది చూడాలి. అనేక అడ్డంకుల మధ్య, పుకార్ల మధ్య, కామెంట్స్ మధ్య హరీష్ ఈ సినిమాని సక్సెఫుల్ గా పూర్తి చేస్తే ఆయన పట్టుదలకు మనమంతా హ్యాట్సాఫ్ చెప్పాల్సి వస్తుంది.