చిరంజీవి హీరో అయ్యారా?

Chiranjevi and YS Jagan Mohan Reddy

పాపం… చిరంజీవి!
ఆయన తీరు చూస్తే అప్పుల అప్పారావు సినిమాలో మొదటి సీన్ గుర్తుకొస్తుంది. ఈ రోజు చిరంజీవి చెప్పిన మాటలకు అప్పుల అప్పారావులో బాబూమోహన్ మాటలకు పెద్దగా తేడా ఏమీ లేదు.

“ఈ సమావేశం ఎంతో సంతృప్తికరంగా సాగింది. సీఎం నన్ను ఓ సోదరుడిలా పండగవేళ ఆహ్వానించి ఆప్యాయంగా మాట్లాడారు. ఆయన మాట తీరు బాగా నచ్చింది. భారతిగారు స్వయంగా భోజనం వడ్డించడం ఆనందంగా అనిపించింది. కొద్ది రోజులుగా సినిమా టికెట్‌ ధరల విషయంలో ఒక మీమాంస ఉంది. దీని వల్ల పరిశ్రమలో అగమ్యగోచర పరిస్థితి ఏర్పడింది. ఏం జరుగుతుందోననే అసంతృప్తి ఓ వైపు.. ఇండస్ట్రీకి మంచి చేద్దామనేదే తమ ఉద్దేశం అని చెబుతున్న ప్రభుత్వం ఒక వైపు. పరిష్కారం దొరకని ఈ సమస్య రోజురోజుకి పెద్దది అవుతోంది. ఈ నేపథ్యంలో సీయం జగన్‌ ప్రత్యేకంగా నన్ను పిలిచారు.ఒక సమస్య గురించి నిర్ణయం తీసుకునే ముందు ఒక కోణంలోనే వినటంకాదు రెండో కోణంలోనూ వినాలని అన్నారు. మీరు వచ్చిన సమస్యలను వినిపిస్తే దానిపై తుది నిర్ణయం తీసుకోవచ్చు అని ఆయన నాతో అన్న మాటలకు నాపై పెట్టిన నమ్మకం, భరోసా ఎంతో బాధ్యతగా అనిపించింది.

సామాన్య ప్రజలకు వినోదం అందుబాటులో ఉండాలనే ఆయన ప్రయత్నాన్ని అభినందిస్తూ, పరిశ్రమలో ఉన్న సాధక బాధకాలు, ఎగ్జిబిషన్‌ రంగంలో థియేటర్‌ యజమానులు పడుతున్న కష్టాలను ఆయన వివరించాను. ఆయన సానుకూలంగా స్పందించారు. ఇండస్ట్రీ పెద్దగా కాదు ఒక బిడ్డగా చెబుతున్నా.. ఎవరూ ఆందోళన చెందొద్దు. అందరూ సంయమనంతో ఉండాలి. తొందరపడి ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దని కోరుతున్నా. మాట జారవద్దు. త్వరలోనే అందరికీ ఆమోదయోగ్యంగా ఉండే నిర్ణయం వస్తుందని ఆశిస్తున్నా” అన్నారు.

అసలు ఇక్కడ సమస్య ఎవరి దగ్గర మొదలైందో చిరంజీవి బలంగా వినిపించారా? అసలు సినీ రంగాన్ని గుప్పిట్లో పెట్టుకోవాలని ప్రయత్నం చేసున్నది ఎవరో ఆయనకు తెలియదా? మరి ఆయన వెళ్ళి జగన్ కి ఏమి చెప్పారు. పైగా సినిమావాళ్ళకు మాట జారవద్దు, సంయమనం పాటించాలని చిరంజీవి చెప్పడం చూస్తే ఆయన అలాంటి పరిస్థితిలోకి నెట్టివేయబడ్డారనే అనుకోవాలి.

అసలు ఈ ఇష్యూలో నోరు జారి సినిమావాళ్ళకు బలిసింది అన్నది ఎవరో చిరంజీవికి తెలియదా? సినిమావాళ్ళకు కులం ముద్ర వేసింది ఎవరో ఆయన దృష్టికి రాలేదా? అవన్నీ తెలిసి కూడా ఏపీ ప్రభుత్వ గీతాన్నే చిరు ఆలపించాల్సి వచ్చిందా?

సినిమా సమస్యలపై… ప్రభుత్వ ఏకపక్ష వైఖరిపై టాలీవుడ్ లో ఇప్పుడిప్పుడే గొంతులు పైకి లేస్తున్న తరుణంలో అందరూ మూసుకొని కూర్చోండి అని చిరంజీవితో చెప్పించారు. ఈ రాజకీయ క్రీడలో తెలుగు సినీ రంగానికి శత్రువుగా మారేది జగన్, ఆయన ప్రభుత్వం కాదు. చిరంజీవి మాత్రమే.

ఈ మాటను జగన్ తన బంధువు, తెలుగు సినిమా పెద్ద తలకాయల్లో ఒకరైన మోహన్ బాబుతో ఎందుకు చెప్పించలేదు? ఆయన కుమారుడు, తనకు వరసకు బావమరిది అయ్యే విష్ణు ఇప్పుడిప్పుడే మా అధ్యక్షుడిగా నిలదొక్కుకొంటున్న తరుణంలో ఆ విలన్ పాత్రను మంచు కుటుంబానికి ఇవ్వకుండా మెగా కాంపౌండ్ కి కట్టబెట్టారు. సినిమా ఇండస్ట్రీతో జగన్ ప్రభుత్వం సఖ్యంగా ఉండొచ్చు… ఉండకపోవచ్చు. కానీ చిరు చెప్పినట్లు రేపోమాపో కూడా సానుకూల నిర్ణయం వస్తుందా అన్నది డౌటే. ప్రభుత్వం చెప్పే టికెట్ ఆన్లైన్ పోర్టల్ సిద్దం కావడానికి మరో మూడు నెలలు పట్టవచ్చు. అప్పటి వరకూ టికెట్ రేట్లు ఏమీ పెరగకపోవచ్చని అంటున్నారు.

నిజంగా చిరంజీవి నమ్ముతున్నట్లు ప్రభుత్వం పూర్తిగా ఇండస్ట్రీకి అనుకూలంగా వెంటనే నిర్ణయం తీసుకుంటే చిరంజీవి రియల్ లైఫ్ లో, సినిమా ఇండస్ట్రీలో హీరో అవుతారు. ఇండస్ట్రీ పెద్దగా మారుతారు. తేడా కొడితే… మొదట విమర్శలు అందుకునేది ఆయనే.

ఇక ప్రభుత్వంతో ఎవరికి ఏ బాధ వచ్చినాసినిమావాళ్లు ముందుగా తిట్టుకొనేది చిరంజీవినే. పండగ పూట పిలిచి పీటేసి భోజనం పెట్టారు అని సంబరపడ్డ చిరంజీవిని చూస్తే పాపం అనక ఇంకేమీ అనాలి?

By సినీవాలి

Advertisement
 

More

Related Stories