సమంతకి హ్యాట్సాఫ్: కృష్ణప్రసాద్

నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ పేరు చెప్పగానే ముందుగా గుర్తొచ్చే చిత్రం…’ఆదిత్య 369′. అది కాకుండా ఇంకా ఎన్నో మంచి చిత్రాలు తీసిన ఈ సీనియర్ నిర్మాత తాజాగా నిర్మించిన చిత్రం… ‘యశోద’. నవంబర్ 11న సినిమా విడుదలవుతోన్న ఈ మూవీ గురించి నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ చెబుతున్న కబుర్లు..

‘యశోద’ ఎలా మొదలైంది?

‘సమ్మోహనం’ తర్వాత నేను నిర్మించిన సినిమా ‘యశోద’. మా అంకుల్ (గాయకుడు) ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం 2020లో చనిపోయారు. ఆ సమయంలో ఎస్పీ చరణ్‌కు తోడుగా చెన్నైలో ఉన్నాను. ఆ సమయంలో హరి, హరీష్ గురించి విన్నాను. కొన్నాళ్ల తర్వాత వాళ్ళు వచ్చి ‘యశోద’ కథ చెప్పారు. పాయింట్ బాగుంది అనుకున్నాను. కానీ ఎవరో తమిళ నిర్మాత ఆ సినిమాని నిర్మిస్తున్నారు అని చెప్పారు. ఆ విషయాన్ని మర్చిపోయాను.

కొన్ని నెలల తర్వాత వాళ్ళు ఫోన్ చేసి ఆ నిర్మాత ఇంకా టైం పడుతుంది అంటున్నారు మీరు నిర్మిస్తారా అని అడిగారు. మూడు నాలుగు కోట్లు బడ్జెట్ చాలు అన్నారు. అంత భారీ పాయింట్ చెప్పారు. అంత తక్కువ బడ్జెట్ ఎందుకు చెప్తున్నారు అని అడిగా. కానీ మాలాంటి కొత్త దర్శకులకు భారీ బడ్జెట్ ఎవరు ఇస్తారు అని అన్నారు.’పుష్ప’, ‘కెజిఎఫ్’ సినిమాలు డబ్బింగ్ జరుగుతోంది. మనం కూడా పాన్ ఇండియా చేస్తే బావుంటుందని చెప్పా. ఈ కథకి పాన్ ఇండియా మార్కెట్ ఉన్న హీరోయిన్ తీసుకుందామని అనుకున్నాం. అలా సమంతని అప్రోచ్ అయ్యాం.

సమంత వెంటనే ఒప్పుకున్నారా?

గత ఏడాది సెప్టెంబర్ 8న సమంత కథ విన్నారు. వెంటనే చేస్తానని చెప్పారు. అన్ని భాషల్లో చేద్దామని చెబితే ఆవిడ ఓకే అన్నారు. ఆమె స్క్రిప్ట్ విన్నప్పటి నుంచి ఎక్స్సైట్ అయ్యారు.

సరోగసీ నేపథ్యమేనా?

సరోగసీ నేపథంలో జరుగుతున్న క్రైమ్ చూపిస్తున్నాం కానీ ఇందులో మంచి, చెడు అనే మోరల్స్ గురించి మాట్లాడడం లేదు.

సమంత ఆరోగ్యం గురించి…

మాకు డబ్బింగ్ టైమ్‌లో ఆమె అనారోగ్యం గురించి తెలిసింది. తెలుగు డబ్బింగ్ పూర్తి చేశాక ఆమె ఎనర్జీ లెవల్స్ తగ్గాయి. అయినా మూడు నాలుగు రోజులు డాక్టర్‌ను దగ్గర పెట్టుకుని డబ్బింగ్ చెప్పారు. ఆవిడ డిడికేషన్‌కు హ్యాట్సాఫ్.

సినిమాలో డైలాగులు డైరెక్టర్లే రాశారా?

దర్శకులు హరి, హరీష్ తమిళులు. ఇద్దరికీ తెలుగు రాదు. అందుకని, తెలుగులో మాటలు రాయడానికి సీనియర్ జర్నలిస్టులు పులగం చిన్నారాయణ, డా. చల్లా భాగ్యలక్ష్మి అయితే బావుంటుందని వాళ్ళకు పరిచయం చేశా. నాకు పదిహేనేళ్ళుగా చిన్నారాయణ పరిచయం. సినిమాలపై మంచి పుస్తకాలు రాశాడు. కథానుగుణంగా ఇద్దరూ చక్కటి మాటలు రాశారు. దర్శకులకు వాళ్ళ వర్క్ బాగా నచ్చింది. 

బాలకృష్ణ గారితో మళ్ళీ సినిమా ప్లానింగ్…

ఆయన ఇమేజ్, నా అభిరుచికి తగ్గ కథ ఎవరైనా తీసుకొస్తే చేయాలని నాకు కూడా ఉంది.

 

More

Related Stories