
నెపొటిజంపై మాట్లాడుతూ టాలీవుడ్ లో జరిగిన ఓ ఘటనను చెప్పుకొచ్చాడు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. హీరోలు అల్లు అర్జున్, రానా కోసం తనను తొక్కేశారంటూ ఓ టాలెంట్ ఉన్న నటుడు తనతో చెప్పాడని వర్మ ప్రకటించాడు. అయితే ఆ నటుడు ఎవరనే విషయాన్ని మాత్రం వర్మ చెప్పలేదు.
అయితే ఇక్కడ ఆ నటుడ్ని వెనకేసుకొని రాలేదు వర్మ. అల్లు అర్జున్, రానా కోసం వాళ్ల తండ్రులు అల్లు అరవింద్, సురేష్ బాబు చేసింది కరెక్ట్ అంటున్నాడు. వాళ్లు తమ పిల్లల కోసం కాకుండా పక్కింటి పిల్లల కోసం పనిచేస్తారా.. ఎదురింటి పిల్లల్ని హీరోలుగా చేస్తారా అని ప్రశ్నిస్తున్నాడు వర్మ.
నెపొటిజం అనేది ప్రతి కుటుంబంలో ఉంటుందని, దాన్ని తప్పుపట్టాల్సిన అవసరం లేదంటున్నాడు. చంద్రబాబు తన వారసత్వాన్ని లోకేష్ కు, వైఎస్ తన వారసత్వాన్ని జగన్ కు, కరుణానిధి తన వారసత్వాన్ని స్టాలిన్ కు మాత్రమే ఇస్తారని, పక్కింటి వాళ్లకు ఇవ్వరని అంటున్నాడు.
ఈ మొత్తం వ్యవహారంలో టాలెంట్ అనే పదార్థం కూడా ఒకటి ఉంటుందని.. అది ఉన్నప్పుడు ఎంత పెద్ద నెపొటిజం అయినా వాళ్ల ముందు ఆగదంటున్నాడు. దీనికి విజయ్ దేవరకొండను ఎగ్జాంపుల్ గా చెప్పాడు వర్మ.