
పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ 2014 అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి సంపూర్ణ మద్దతు పలికింది. కానీ అప్పుడు పవన్ కళ్యాణ్ పోటీ చెయ్యలేదు కానీ టీడీపీ కోసం విస్తృతంగా ప్రచారం చేశారు. అప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన తెలుగుదేశం పార్టీకి మిత్రపక్షంగా కాకుండా ఒంటరిగా పోటీ చేసింది. తెలుగుదేశం పార్టీ ఓడింది. జనసేనకు కేవలం ఒక్క సీటు మాత్రమే దక్కింది.
ఈసారి మళ్ళీ టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తున్నాయి. ప్రస్తుత ముఖ్యమంత్రి వై. ఎస్. జగన్ మోహన్ రెడ్డిని గద్దె దించడం కోసం చేతులు కలిపినట్లు పవన్ కళ్యాణ్ ఇప్పటికే ప్రకటించారు. అందుకే ఎక్కువ సీట్ల కోసం కాకుండా 98 శాతం స్ట్రైక్ రేట్ అనే లక్ష్యంతో తక్కువ సీట్లలో జనసేన పోటీ చేయబోతుంది అని చెప్పారు పవన్ కళ్యాణ్.
తాజాగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కలిసి తమ అభ్యర్థులను ప్రకటించారు. పొత్తులో భాగంగా జనసేన పార్టీ 24 అసెంబ్లీ స్థానాల్లో, 3 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేస్తుందని ప్రకటించారు.
ఐతే, పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అనే విషయం ఇంకా ప్రకటించలేదు.