
జాన్వీ కపూర్ పేరు బాలీవుడ్ లో కన్నా ఇప్పుడు టాలీవుడ్ లో మార్మోగిపోతోంది. ఎందుకంటే ఈ అందాల భామ యంగ్ టైగర్ సరసన నటిస్తోంది. “దేవర” చిత్రంలో ఆమె కథానాయిక. తెలుగులో ఆమెకిదే మొదటి సినిమా. ఆమె ఇంకా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ లో పాల్గొనలేదు. కానీ, ఎన్టీఆర్ ఫ్యాన్స్, కుర్రకారు జాన్వీని సోషల్ మీడియాలో ఫాలో అవడం మొదలుపెట్టారు.
ఇలా తెలుగులో యంగ్ టైగర్ తో నటిస్తున్న ఈ భామ ఇప్పుడు బాలీవుడ్ లో టైగర్ ష్రాఫ్ తో నటించనుంది. తాజాగా ఆమె టైగర్ కొత్త సినిమా అధికారికంగా సైన్ చేసింది. ఆమె ఈ సినిమా ఒప్పుకొని చాలా కాలమే అవుతోంది. కానీ ఇప్పుడు అఫీషయల్ లాంఛనాలు పూర్తి అయ్యాయి. ఇక షూటింగ్ కూడా మొదలు కానుంది.
హాలీవుడ్ లో క్లాసిక్ గా పేరొందిన “రాంబో” మూవీని టైగర్ ష్రాఫ్ తో రీమేక్ చేస్తున్నారు బాలీవుడ్ దర్శక, నిర్మాత సిద్ధార్థ్ ఆనంద్. “పఠాన్”, “వార్” వంటి సినిమాలు డైరెక్ట్ చేసిన సిద్ధార్థ్ ఆనంద్ ఈ “రాంబో” రీమేక్ ని నిర్మిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి జీవితాన్ని మలుపు తిప్పిన “ఖైదీ” చిత్రానికి ఆధారం …”రాంబో”నే. ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీతో టైగర్ ష్రాఫ్ తో కళ్ళు చెదిరే యాక్షన్ డ్రామాగా మలుస్తారట.
జనవరి నుంచి షూటింగ్ మొదలు కానుంది. జాన్వీ కపూర్ జనవరి నుంచి ఈ సినిమాతో బిజీ కానుంది.

సినిమాకి 5 కోట్లపైనే పారితోషికం డిమాండ్ చేస్తున్న ఈ భామ బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ చిత్రాలపై ఫోకస్ పెట్టింది. టైగర్, యంగ్ టైగర్ లతో సినిమాలు పూర్తి అయ్యాక మరిన్ని తెలుగు సినిమాలు సైన్ చెయ్యడం ఖాయం.