
జయప్రద, జయసుధ, విజయశాంతి… ముగ్గురి పేర్లలో ‘జయ’ ఉంది. హీరోయిన్లగా ముగ్గురూ విజయం సాధించిన వారే. కానీ రాజకీయాల్లోనే మిశ్రమ ఫలితాలు చూశారు. ఒకప్పుడు ఒక్కొక్కరు ఒక్కో పార్టీలో ఉండేవాళ్ళు. ఇప్పుడు అందరిదీ ఒకే కండువా కానుంది.
విజయశాంతి ఇప్పటికే బీజేపీలో సీనియర్ సభ్యురాలు. ఇటీవల జయప్రద చేరారు. ఇప్పుడు జయసుధ బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారట. జయసుధ ఇప్పటికే బీజేపీ నాయకులతో చర్చలు పూర్తి చెయ్యనున్నారు. అందరూ ‘ఆంధ్ర’మూలాలు ఉన్నవాళ్లే. ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ తరఫున బరిలోకి దిగనున్నారు.
జయప్రద, జయసుధ 1970లల్లోనే హీరోయిన్లుగా స్థిరపడిపోయారు. 80లలో అగ్ర హీరోయిన్లుగా చలామణీ అయ్యారు. 80లలోనే పరిచయం అయి అగ్రతారగా దూసుకెళ్లిన విజయశాంతి వీరికన్నా పెద్ద స్టార్ గా పేరు తెచ్చుకున్నారు. విజయశాంతి సొంతంగా పార్టీ కూడా పెట్టారు. ఆ తర్వాత దాన్ని టీఆరెస్లో కలిపి ఆ పార్టీ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. తర్వాత కాంగ్రెస్, ఆ తర్వాత బీజేపీలోకి జంప్.
జయప్రద…. తెలుగుదేశం, సమాజ్ వాది పార్టీల మీదుగా వచ్చి బీజేపీలో చేరారు. జయసుధ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచి, ఆ తర్వాత కొన్నాళ్ళు వైఎస్సార్ కాంగ్రెస్ వైపు ఉండి ఇప్పుడు బీజేపీ వైపు చూపు వేస్తున్నారట.