
ఇప్పుడు అందరూ పాన్ ఇండియా స్టార్స్ అవ్వాలనుకుంటున్నారు. మన తెలుగు నుంచి ఇప్పటికే అలా పలువురు స్టార్స్ పాన్ ఇండియా హీరోలుగా నిలబడ్డారు. “ఆర్ ఆర్ ఆర్” మూవీ ఆస్కార్ వేదిక వరకు వెళ్లిన తర్వాత రామ్ చరణ్, ఎన్టీఆర్ లు గ్లోబల్ స్టార్స్ అని వాళ్ళ అభిమానులు చెప్పుకోవడం మొదలుపెట్టారు.
ఐతే, పవన్ కళ్యాణ్ ని నిజమైన ఇంటర్నేషనల్ స్టార్ ని చేస్తాను అని అంటున్నారు కేఏ పాల్. ఈ క్రైస్తవ మత ప్రవక్త కమ్ పొలిటికల్ లీడర్ గురించి పరిచయం అక్కర్లేదు. ఇంతకుముందు తెలంగాణాలో తెగ లొల్లి చేసిన పాల్ ఇప్పుడు ఆంధ్రపదేశ్ మీద ఫోకస్ పెట్టారు.
పవన్ కళ్యాణ్ రాజకీయాలు వదిలెయ్యమని సలహా ఇస్తున్నారు పాల్. ఎందుకంటే… పవన్ కళ్యాణ్ ఏపీ పాలిటిక్స్ నుంచి తప్పుకుంటే పాల్ ఏపీ రాజకీయాలను దున్నేస్తాడట. ప్రతిఫలంగా పవన్ కళ్యాణ్ ని ఇంటర్నేషనల్ స్టార్ ని చేస్తాడట.
ఎంతోమంది అమెరికన్ ప్రెసిడెంట్ల గెలవడానికి కారణం తానే అని చెప్పుకుంటూ ప్రసంగాలు చేసే చిట్టివలస చిట్టి పొలిటిషియన్ తాజాగా ఏంజిలినా జోళితో మాట్లాడి పవన్ కళ్యాణ్ ని అంతర్జాతీయ హీరోని చేస్తారట.
“ఏంజిలినా, టామ్ క్రూజ్ నా ఫ్రెండ్స్. వాళ్ళతో మాట్లాడి నిన్ను ఇంటర్నేషనల్ స్టార్ ని చేస్తా. నువ్వు సినిమాల్లో ఉండు… నేను రాజకీయాల్లో ఉంటాను. నాకు హెల్ప్ చెయ్యి. నేను నిన్ను బిగ్ స్టార్ ని చేస్తా…” అంటూ పాల్ తనదైన శైలిలో చెప్పాడు.