కళాతపస్వి: బిరుదే కాదు బరువు కూడా!


కె.విశ్వనాథ్ ని కళాతపస్విగా ప్రేక్షక లోకంలో చిరంజీవిని చేసిన చిత్రం ‘శంకరాభరణం’. తెలుగు సినిమా దర్శకుల సృజనాత్మకత గురించి నేల నలుచెరగులా చర్చించుకొనేలా చేసిన చిత్రరాజంగా ‘శంకరాభరణం’ నిలిచింది. అయితే చిత్రసీమ, ప్రేక్షకులు కె.విశ్వనాథ్ ను ఒక చట్రంలోకి నెట్టి వేసింది ఆ చిత్రమే అంటే విచిత్రంగానే ఉంటుంది.

కె.విశ్వనాథ్ దర్శక ప్రస్థానాన్ని పరిశీలిస్తే – ‘శంకరాభరణం’ ముందు ఉన్న ఆయన శైలి.. ఎంచుకున్న కథలు వేరు. అయితే ‘శంకరాభరణం’ తరవాత వచ్చిన చిత్రాల గురించే సినీ పరిశ్రమగానీ, సినీ విమర్శకులుగానీ ఎక్కువగా మాట్లాడుతున్నారు. ఫలితంగా నిన్నటి తరం, నేటి తరం సినీ ప్రియులు విశ్వనాథ్ సినిమాలంటే శంకరాభరణం, సిరివెన్నెల, స్వర్ణకమలం, సాగర సంగమం, శృతిలయలు… లాంటివే అనుకొంటున్నారు. విశ్వనాథ్ సినిమాలంటే కర్నాటక సంగీతం, భరత నాట్యం, కూచిపూడి ఉంటాయి, పాటలు వినసొంపుగా ఉంటాయి అని ఒక స్థిర అభిప్రాయానికి వచ్చేలా చేశారు సినీ పండితులు.

విశ్వనాథ్ సినిమాలంటే శంకరాభరణం, శృతిలయలు లాంటివే కాదు ఒక ఆత్మ గౌరవం, ఒక శారద, ఒక నేరము-శిక్ష, ఒక ప్రెసిడెంట్ పేరమ్మ, ఒక సీతామాలక్ష్మి లాంటివి ఉన్నాయి… అవి కూడా అవార్డులు, నాటి ప్రేక్షకుల మన్ననలు అమితంగా పొందాయి అని ఎందుకు విస్మరిస్తారు.

శంకరాభరణం కంటే ముందుగా వచ్చిన ఆ సినిమాల్లో విశ్వనాథ్ దర్శకత్వం వచ్చిన చిత్రాల్లో మానవ సంబంధాలు, సామాజిక పరిస్థితులు, జనం మనస్తత్వాల్లాంటివి ప్రస్పుటంగా కనిపిస్తాయి. శంకరాభరణం, ఆ తరవాత వచ్చిన చిత్రాల మాదిరే అవి కూడా ఇతర భాషలవారిని ఆకట్టుకున్నాయి. చక్కటి సంగీతం, శ్రోతలను మెప్పించిన గీతాలున్నాయి.

విశ్వనాథ్ తన తొలి చిత్రం ‘ఆత్మ గౌరవం’లో కుటుంబ బంధాలు, జమిందారీ కుటుంబ పోకడలను చూపించారు. 1966లో వచ్చిన ఆ సినిమా నాటి కాలమాన పరిస్థితులు, నవలా సాహిత్య పోకడలతో ఉంటుంది. అలాగే రష్యన్ రచయిత దాస్తోవిస్కీ రాసిన ‘క్రైమ్ అండ్ పనిష్మెంట్’ ఆధారంగా ‘నేరము – శిక్ష’ చిత్రాన్ని విశ్వనాథ్ రూపొందించారు. కుబేర పుత్రుడు విజయ్ నిర్లక్ష్యంగా కార్ రేసింగ్ చేసి ఒక పేదవాడి మరణానికి కారణం అవుతాడు. చనిపోయిన వ్యక్తి తమ్ముడు అంధుడు. విజయ్ తాను చేసిన నేరానికి ఏ విధమైన శిక్ష అనుభవించాడు అనే అంశాన్ని చెప్పిన విధానం విశ్వనాథ్ దర్శకత్వ ప్రతిభకు, స్క్రీన్ ప్లే శైలిని చూపిస్తుంది. ఈ సినిమా ఇప్పటి తరానికీ చూపించదగ్గదే. కార్, బైక్ రేసులతో రెచ్చిపోయేవారికీ, వారిని గారాబం చేసే కన్నవారికీ ఒక పాఠం లాంటిది. ఈ సినిమా తమిళ, హిందీ భాషల్లోకి రీమేక్ అయింది.

1973లో వచ్చిన ‘శారద’ చిత్రం కథానాయిక ప్రాధాన్యం ఉన్నది. మానసిక స్థిరత్వం లేని గ్రామీణ యువతి చుట్టూ తిరిగే కథ ఇది. ఇందులో మానసిక వైద్యుడికీ, శారదకీ మధ్య వచ్చే సన్నివేశాలు, శారద సోదరుడితో ఉండే సన్నివేశాలు మనసుని కుదిపేస్తాయి. ఈ కథలో గోదావరి నది మనం గుర్తించని ఒక కీలక పాత్ర అనుకోవచ్చు. శారద అనే ఆ యువతి జీవితాన్ని ఆ నది అంతగా ప్రభావితం చేస్తుంది.

‘సీతామాలక్ష్మి’ చిత్రంలోని ప్రేమ కథ ఏ తరానికైనా నచ్చుతుంది. పల్లెటూరి ప్రేమ జంట కొండయ్య-సీతాలు జీవితాన్ని సినిమా ప్రపంచం ఏ విధంగా ప్రభావితం చేసింది, వారి భావోద్వేగాలు ఏమిటో ఆ చిత్రంలో చూపించారు. రాంగోపాల్ వర్మ తీసిన రంగీలా సినిమాకు ఈ సినిమాయే స్ఫూర్తి.

1974లో వచ్చిన ‘ఓ సీత కథ’ అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శితమైంది. ఆ సమయంలో ఈ సినిమా కథ ఒక విప్లవాత్మకమైనదే. ఈ తరహా కథలను ఆ తరవాతి రోజుల్లో పలువురు తమిళ దర్శకులు ఎంచుకున్నారు. ‘ఓ సీత కథ’ చిత్రాన్ని తమిళ, మలయాళ భాషల్లోకి దర్శకులు రీమేక్ చేశారు. కె.బాలచందర్ తీసిన మూన్డ్రు ముడిచ్చికి ఈ సినిమాయే ఆధారం. శోభన్ బాబు నటించిన “జీవన జ్యోతి” సైతం తాష్కెంట్ చిత్రోత్సవాల్లో ప్రశంసలు పొందింది. హిందీ, కన్నడ భాషల్లోకి వెళ్లింది.

‘సిరిసిరిమువ్వ’ విశ్వనాథ్ దర్శకత్వ ప్రతిభను ఉన్నత శిఖరాల వైపు తీసుకువెళ్లింది. శాస్త్రీయ నృత్యంపై తపన ఉన్న హైమ అనే మూగ యువతి జీవితం చుట్టూ తిరిగే కథ ఇది. అద్భుతమైన సంగీత, నృత్యాలతో సాగుతుంది. జాతీయ స్థాయి పురస్కారాలు పొందింది. “ప్రెసిడెంట్ పేరమ్మ” సినిమా గ్రామ రాజకీయాలను చూపిస్తుంది.

మనం ఉదహరించుకున్న చిత్రాలు విశ్వనాథ్ రూపొందించిన ‘శంకరాభరణం చిత్రానికి ముందు వచ్చినవే. ఏ కథకు ఆ కథే వైవిధ్యంగా, భిన్న నేపథ్యాల్లో సాగుతాయి. విశ్వనాథ్ అంటే సంగీతం, నృత్య ప్రధానమైన సినిమాలు మాత్రమే కాదు అనేందుకు ఉదహరించదగ్గ చిత్రాలు. ఇందులో పల్లె యువతుల జీవితాలు, కుబేర పుత్రుల విలాసాలు, సవతి తల్లి దాష్టీకాలతో మూగ యువతి పడ్డ కష్టాలు, గ్రామీణ రాజకీయాల.. ఏవి లేవు. అన్నీ ఉంటాయి. భావోద్వేగాలు ఉంటాయి. హాయిగా నవ్విస్తాయి. వినసొంపైన గీతాలు ఉంటాయి.

అయితే ‘శంకరాభరణం’ తరవాత ఆయన కథల్లోకి శాస్త్రీయ సంగీతం, నృత్యాలు కనిపించని పాత్రలుగా మారిపోయాయి. కథ ఏదైనా వాటికి నేపథ్యంగా అవి ఉంటాయి అని ప్రేక్షకులు మానసికంగా, ముందస్తు నిశ్చితాభిప్రాయానికి రావడం ఒక విధంగా దురదృష్టమే. వీటి చుట్టూనే విశ్వనాథ్ చిత్రాలు తిరగాలని నిర్మాతలు కూడా కోరుకోవడం మొదలుపెట్టారు. ఆ ‘శంకరాభరణం’ తరవాత తన పంథా మార్చేందుకు ‘అల్లుడుపట్టిన భరతం’, ‘జననీ జన్మభూమి’ లాంటి చిత్రాలు చేశారు. అయితే విశ్వనాథ్ సినిమా అనేసరికి సంగీతం, నృత్యం అనే ఆభరణాలు తొడగాల్సిందే అనే ముద్ర పడిపోయింది. ఒక విధంగా దర్శకుడిగా ఆయన కోరుకోని ఒక ముద్రను ఆయన స్వీకరించాల్సి వచ్చింది. కళా తపస్వి అనే ఆ కిరీటం ఒక విధంగా ఆయనకు తెలియని బరువుగా మారిపోయింది. ఆ బరువును దించుకొనేందుకే దర్శకత్వం వైపు నుంచి నటన వైపు వచ్చారా అనే సందేహం కూడా సినీ ప్రియులకు కలుగుతూ ఉంటుంది.

‘శంకరాభరణం’ ముందు తరవాత అని విశ్వనాథ్ చిత్రాలను విభజించుకొని చూసినా ఆయనలో అంతర్లీనంగా ఉన్న మానవీయ కోణం ప్రతి సినిమాలో కనిపిస్తుంది. కథలో నాయకుడు మాత్రమే కాదు ఆయన వెన్నంటి ఉండే నాయిక కూడా వ్యక్తిత్వం ఉన్న మనిషే అని నమ్మారు. ఆయన కథల్లో నాయిక వ్యక్తిత్వమే ఒక పాలు ఎక్కువగా ఉంటుంది. శుభలేఖ, శృతిలయలు, స్వాతిముత్యం, స్వాతికిరణం, ఓ సీత కథ… ఇలా ఏ సినిమా చూసినా నాయిక పాత్ర వచ్చి వెళ్లిపోయేలాగో, పాటలకు ప్రేమ సన్నివేశాలకే పరిమితం అన్నట్లు ఉండదు.

కథ ఏది తీసుకున్నా ప్రేక్షకుడి మనసుని హత్తుకొనేలా.. అరె ఇది మన జీవితంలోని అంశమే, మనకు తెలిసిన వారి జీవితమే అన్న విధంగా తీయడమే కాదు- ఇదీ మన సంస్కృతి అని, ఇదీ మన సంగీతం, ఇదీ మన సాహిత్యం అని చూపించిన దర్శక స్రష్ట కాశీనాథుని విశ్వనాథ్.

By Siri

Advertisement
 

More

Related Stories