
కమల్ హాసన్ కి మొన్నటివరకు అప్పుల తిప్పలే. ఆయన నిర్మాణ సంస్థ తీసిన సినిమాలు అపజయం పొందాయి. దాంతో, ఫైనాన్సియర్ల వద్ద వడ్డీలు జమ అయ్యాయి. అన్నింటికీ ఒక్కటే పరిష్కారం అని పెద్ద రిస్క్ తీసుకొని ‘విక్రమ్’ సినిమా నిర్మించారు కమల్ హాసన్. అందులో తన పాత్రని తగ్గించుకొని విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్ ని ముందు పెట్టారు. మరో పెద్ద హీరో సూర్యతో అతిథి పాత్ర వేయించారు.
ఇలా ఆయన తన శైలికి భిన్నంగా యువ డైనమిక్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ఆలోచనలకు అనుగుణంగా వెళ్లారు. అదే తిరుగులేని విజయం తెచ్చిపెట్టింది. ‘విక్రమ్’ తమిళనాట ఆల్ టైం రికార్డులు సెట్ చేసింది. తెలుగులో కూడా ఘన విజయం సాధించింది. మొత్తమ్మీద, కమల్ కి లాభాల పంట పండింది.
ఇప్పుడు తన బ్యానర్ ఫై ఉన్న అప్పులన్నీ తీరిపోయాయి. కొత్త సినిమాలకు ఫైనాన్స్ సమస్య లేదు. ఇక మరిన్ని సినిమాలు నిర్మించేందుకు ఆయన రెడీ అవుతున్నారు.
కమల్ హాసన్ సంస్థ నుంచి కొత్త సినిమాల ప్రకటనలు రానున్నాయి. అందులో ఒకట్రెండు సినిమాల్లో మాత్రమే ఆయన నటిస్తారు. మిగతావాటిలో ఇతర తమిళ అగ్ర హీరోలు ప్రధాన పాత్రలు పోషించే అవకాశం ఉంది.