
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు 2021 వేసవిలో జరుగుతాయి. అంటే ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే పార్టీలు, రాజకీయనాయకులు ఇప్పటినుంచే ప్రజలని కలుస్తూ బిజీగా ఉండాలి. ఎన్నికల్లో ఎలా గెలవాలి వ్యూహాలు రచిస్తూ బిజీగా ఉండాలి. మిగతా వ్యాపకాలు, వ్యాపారాలు బంద్ పెట్టాలి. కానీ విచిత్రంగా అటు రజినీకాంత్, ఇటు కమల్ హాసన్… జనవరి, ఫిబ్రవరి వరకు సినిమా షూటింగ్ ల్లో పాల్గొంటారట.
కమల్ హాసన్ కి ఇప్పటికే రాజకీయ పార్టీ ఉంది. ఆ పార్టీకి ఒక వ్యవస్థ, కార్యకర్తలు ఉన్నారు. అయినా కూడా ఆయన పోటీ చెయ్యాలనుకుంటే… ఇప్పుడు ఏ సినిమాలు ఒప్పుకోవద్దు. కానీ ఆయన ఈనెల, వచ్చే నెల “విక్రమ్” అనే సినిమా షూటింగ్ లో పాల్గొంటారట. అలాగే, ఆగిపోయిన “భారతీయుడు 2” సినేమని కూడా మళ్ళీ మొదలుపెట్టే ఆలోచన చేస్తున్నారని, ఫిబ్రవరిలో ఆ మూవీ షూటింగ్ కూడా రీస్టార్ట్ చేస్తారనేది లేటెస్ట్ టాక్.
ఫిబ్రవరి వరకు సినిమాలతోనే గడిపితే, ఎన్నికల్లో గెలవగలరా? ఎన్నికలను కమల్ సెరియస్ గానే తీసుకుంటున్నారా? అన్న అనుమానాలు మొదలయ్యాయి.
సేమ్ సీన్ రజినీకాంత్ విషయంలో కూడా జరుగుతోంది. రజినీకాంత్ కూడా “అన్నాత్తే” సినిమా షూటింగ్ లో వచ్చే నెల వరకు పాల్గొంటాడట. మరి ఆయన పార్టీకి యంత్రాంగం ఎప్పుడు సిద్ధం చేస్తాడు? ఎన్నికల్లో ఎలా పాల్గొంటాడు?