
“ఈ శుక్రవారం (ఫిబ్రవరి 25) 200 కోట్లు బూడిదలో పోసిన పన్నీరు కానుంది. ప్రేమకథల పోరి నటించగలదని ఆమె బిగ్ డాడీ (కరణ్ జోహార్) నిరూపించాలని అనుకుంటున్నాడు. ఈ సినిమాకి ఉన్న అతిపెద్ద ఉన్న మైనస్ పాయింట్ అందులో నటించిన వారే. దక్షిణాది చిత్రాలు, హాలీవుడ్ సినిమాలు బాలీవుడ్ ని మింగేస్తున్నాయి అంటే ఇదే కారణం,” అని కంగన రనౌత్ గతవారం తన ఇన్ స్టాగ్రామ్ లో రాసుకొంది. పేరు పెట్టకుండా అలియా భట్ నటించిన ‘గంగూబాయి’ దారుణంగా పరాజయం కానుంది అని జోస్యం చెప్పింది.
‘గంగూబాయి’ అట్టర్ ఫ్లాప్ కావాలని శపించింది. కానీ ఆమె జోస్యం నిజం కాలేదు. ఆమె శాపం అలియాని ఏమీ చెయ్యలేదు. ‘గంగూబాయి’ పెద్ద హిట్ గా నిలవనుంది.
‘గంగూబాయి’ మొదటి ఐదు రోజుల్లో ఇండియాలో 55 కోట్ల వరకు వసూళ్లు అందుకొంది. ఈ మధ్యకాలంలో ‘సూర్యవంశీ’ తర్వాత భారీ ఓపెనింగ్ వచ్చిన హిందీ చిత్రం ఇదే.
హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలకు తానే సూపర్ స్టార్ అని చెప్పుకునే కంగనా రనౌత్ రీసెంట్ చిత్రాలన్నీ దారుణ పరాజయం పొందాయి. ‘క్వీన్’, ‘తను వెడ్స్ మను’, తర్వాత ఆమెకి విజయాలు లేవు. ‘మణికర్ణిక’ ఫర్వాలేదనిపించింది.

కంగనా నటించిన రీసెంట్ చిత్రాల వసూళ్లపై లుక్.
- తలైవి… 10 కోట్లు
- పంగా … 28 కోట్లు
- సిమ్రాన్ … 18 కోట్లు
- కట్టిబట్టి… 24 కోట్లు
- రివాల్వర్ రాణి … 10 కోట్లు
‘గంగూబాయి’ కేవలం ఐదు రోజుల్లోనే 55 కోట్ల వసూళ్లు అందుకొంది.