కత్రినని నటిగా గుర్తించినట్లే

Katrina Kaif

కత్రిన కైఫ్ దాదాపు 20 ఏళ్ల క్రితం సినిమాల్లోకి అడుగుపెట్టింది. వెంకటేష్, కత్రిన నటించిన “మల్లీశ్వరి” నుంచి నిన్న మొన్నటి “టైగర్ 3” వరకు ఆమెకి గ్లామర్ హీరోయిన్ అన్న పేరు మాత్రమే ఉంది. ఆమె బాగా నటించగలదు అనే మాట రాలేదు.

మొదటి సారి ఆమె నటనకు ఇప్పుడు ప్రశంసలు దక్కుతున్నాయి.

కత్రిన నటించిన కొత్త చిత్రం… మెర్రీ క్రిస్మస్. ఈ సినిమా ఈ సంక్రాంతి కానుకగా విడుదలైంది. ప్రస్తుతం థియేటర్లలో నడుస్తోంది. ఈ సినిమాలో కత్రిన నటనకు క్రిటిక్స్ నుంచి మంచి మార్కులు పడ్డాయి. “ఇన్నేళ్ల కెరీర్ లో కత్రిన నటనతో మెప్పించిన సినిమా ఇదే. ఆమెలో మంచి నటి ఉందని ఇప్పుడు అర్థమవుతోంది,” అని ఒక విమర్శకుడు ఆ సినిమా రివ్యూలో రాశారు.

దాదాపుగా అన్ని రివ్యూస్ అలాగే ఉన్నాయి. ఆమె నటన గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు. ఈ సినిమాలో ఆమె తమిళ నటుడు విజయ్ సేతుపతి సరసన నటించింది. “బదలాపూర్”, “అందాదూన్”, “జానీ గదర్” వంటి మంచి థ్రిల్లర్స్ తీసిన శ్రీరామ్ రాఘవన్ ఈ సినిమాకి దర్శకుడు. శ్రీరామ్ కత్రినాలోని నటిని జనాలకు కొత్తగా పరిచయం చేశాడు ఇప్పుడు.

ఈ సినిమాలో విజయ్ సేతుపతి వంటి అద్భుతమైన నటుడితో కలిసి చేసింది ఆమె. సాధారణంగా విజయ్ సేతుపతి డామినేట్ చేస్తాడు తన నటనతో. కానీ “మెర్రీ క్రిస్మస్”లో కత్రిన విజయ్ సేతుపతికి ధీటుగా నటించిందట. అంటే ఆమెకి నటిగా డిస్టింక్షన్ వచ్చినట్లే.

Advertisement
 

More

Related Stories