“భోళా శంకర్” సినిమాలో మెగాస్టార్ చిరంజీవితో నటించడం మరిచిపోలేని అనుభూతి అని అంటున్నారు హీరో సుశాంత్. ఈ సినిమాలో చిరంజీవికి సోదరిగా కీర్తి సురేష్ నటించింది. ఆమె సరసన సుశాంత్ నటించాడు.
“చిన్నప్పటినుంచి చిరంజీవి గారి డ్యాన్స్ అంటే పిచ్చి. చిన్నప్పుడు ఆయన సాంగ్ షూటింగ్ కి రెండు మూడుసార్లు వెళ్లాను. మెగాస్టార్ తో స్క్రీన్ పంచుకోవడమే ఒక అదృష్టం అనుకుంటే ఈ సినిమాలో ఏకంగా ఆయనతో డ్యాన్స్ చేసే అవకాశం దక్కింది. ఇది మరిచిపోలేని అనుభూతి,” అని అన్నారు సుశాంత్.
ఇంతకుముందు అల్లు అర్జున్ తో కూడా “అల వైకుంఠపురంలో” సుశాంత్ నటించాడు. అలాగే బన్నీతో కలిసి డ్యాన్స్ చేశాడు. “చిరంజీవి గారు చిరంజీవి గారే. బన్నీ మంచి డ్యాన్సరే కానీ చిరంజీవి గారితో బన్నీని పోల్చలేం. బన్నీకి కూడా చిరంజీవి గారే ఆదర్శం,” అని సమాధానం ఇచ్చాడు సుశాంత్.
సాధారణంగా కీర్తి సురేష్ పెద్ద హీరోలు లేదా నాని వంటి మిడ్ రేంజ్ హీరోలతో వర్క్ చేస్తుంది. అలాంటి పెద్ద హీరోయిన్ కి జోడిగా నటించే ఛాన్స్ దక్కడం గురించి అడగ్గా ఆమె ఇప్పుడు తనకు మంచి ఫ్రెండ్ గా మారింది అని చెప్పాడు సుశాంత్. “మా కెమిస్ట్రీ చాలా సహజంగా ఉంటుంది. షూటింగ్ కొద్ది రోజుల్లోనే మేం మంచి ఫ్రెండ్స్ అయ్యాం,” అని తెలిపాడు.