
తెలుగు సినిమాకి పరిచయం అవుతున్న మరో మోడల్… కేతిక శర్మ. మోడలింగ్ రంగం నుంచి తెలుగు సినిమా రంగంలోకి అడుగుపెడుతోంది. ఓ సైడ్ లో చూస్తే… పూరి జగన్నాధ్ పరిచయం చేసిన అయేషా టకియా గుర్తొచ్చేలా ఉంది. పూరి తన తనయుడు ఆకాష్ పూరి హీరోగా నిర్మించిన ‘రొమాంటిక్’ సినిమాలో ఈ ముద్దుగుమ్మకు అవకాశం ఇచ్చారు. ఈ శుక్రవారం (అక్టోబర్ 29) విడుదల అవుతోంది. తొలి చిత్రం విడుదలవుతోన్న ఎక్సయిట్మెంట్ లో ఉన్న కేతిక శర్మ మీడియాతో ముచ్చటించింది.
“మాది డీల్లీ. కుటుంబంలో అందరూ డాక్టర్లే. నేను డాక్టర్ కాకుండా యాక్టర్ అవ్వాలనుకున్నాను. ఇన్ స్టాగ్రామ్ లో నా ఫోటోలు చూసి అవకాశం ఇచ్చారు,” అని చెప్తోంది కేతిక.
‘రొమాంటిక్’లో ఆమె మోనిక అనే అమ్మాయిగా నటించింది. “ఈ క్షణాన్ని ఎంజాయ్ చేయాలని అనుకునే అమ్మాయి పాత్ర అది. ఎవరినైనా ప్రేమిస్తే.. మనస్ఫూర్తిగా ప్రేమిస్తుంది. నా మొదటి చిత్రమే పూరి బ్యానర్‌లో చేయడం ఆనందంగా ఉంది,” అని అంటోంది.
అన్నట్లు ఈ సినిమాలో ఆమె ఒక పాట కూడా పాడింది. “నా వల్లే కాదే అనే పాటను పాడాను.” హీరో ఆకాష్ తో మంచి స్నేహం కూడా కుదిరిందట. “హీరో ఆకాష్ మంచి వాడు. అతని రూపంలో ఓ మంచి ఫ్రెండ్ దొరికాడు ఈ సినిమా వల్ల,” అని తెలిపింది కేతిక.

మొదటి సినిమా విడుదలకు ముందే ఆమెకి తెలుగులో ఇతర చిత్రాల్లో పాత్రలు దక్కాయి. “పూరి గారు ఓ అమ్మాయిని హీరోయిన్‌గా సెలెక్ట్ చేశారంటే.. కచ్చితంగా ఏదో టాలెంట్ ఉందని అంతా అనుకుంటారు. అందుకే నాకు ఈ సినిమా విడుదల కాకముందే అవకాశాలు వచ్చాయి. నాగ శౌర్యతో లక్ష్య, వైష్ణవ్ తేజ్‌తో మరో సినిమాను చేస్తున్నాను,” అని చెప్పింది కేతిక.
హీరోయిన్లలో సాయి పల్లవి అంటే ఇష్టమంట.