KGF Chapter 2 – తెలుగు రివ్యూ

- Advertisement -
KGF 2

రివ్యూలోకి వెళ్లే ముందు, ముందుగా KGF మొదటి భాగాన్ని ఓసారి గుర్తు చేసుకుందాం. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన కేజీఎఫ్-1లో కన్నడ స్టార్ యష్ హీరోగా నటించాడు.

కేజీఎఫ్ అంటే కోలార్ గోల్డ్ ఫీల్డ్స్. కర్ణాటకలో కోలార్ ప్రాంతంలో బంగారు గనులున్న ప్రాంతం. అక్కడ నరచి అనే కంపెనీ సున్నపు గనుల తవ్వకాల పేరు చెప్పి బంగారు గనుల కోసం తవ్వకాలు చేస్తూ బయట ప్రపంచానికి తెలియని ఒక బానిస రాజ్యాన్ని సృష్టిస్తుంది. దాని అధిపతి కొడుకైన గరుడని చెప్పేందుకు అక్కడికి వెళ్తాడు రాకీ. ఆ తర్వాత అక్కడి పనివారికి రక్షకుడిగా మారిన రాకీ ఎదుగుదల వైనం మొదటి భాగం చూపించింది. నరాచి కంపెనీ యజమాని కొడుకు గరుడ హత్యతో మొదటి భాగం ముగిసింది. 1981లో భారత కొత్త ప్రధానమంత్రిగా రమిక సేన్ (రవీనా టాండన్) ప్రమాణ స్వీకారం చేసే టైమ్ కి రాకీ అత్యంత శక్తిమంతుడైన డాన్ గా మారతాడు.

మొదటి భాగం విడుదలైన అన్ని ప్రాంతాలు, భాషల్లో బ్లాక్ బస్టర్ అయింది. ఒక పేద యువకుడు డాన్‌గా ఎదగడం అందరికీ తెలిసిన కథే. అమితాబ్ బచ్చన్ నటించిన దీవార్ మొదట గుర్తొస్తుంది. అయినప్పటికీ.. దర్శకుడు నీల్ స్క్రీన్‌ప్లే, ఎడిటింగ్ ప్యాటర్న్, యష్ స్టయిల్, యాక్టింగ్ ఆకట్టుకున్నాయి. ఇప్పుడు పార్ట్-2 వచ్చింది.

రాకీ (యష్) KGFలోని మిగతా 9 గనుల్ని కనిబెడతాడు. అన్ని గనుల్లో మైనింగ్ మొదలుపెడతాడు. లెక్కలేనంత బంగారాన్ని పోగు చేస్తున్నాడు. కానీ అధీర (సంజయ్ దత్) మాత్రం ఊరుకోడు. గరుడ ఉన్నంతకాలం నరాచీలో అడుగుపెట్టనంటూ వెళ్లిపోయిన అధీరా చనిపోయాడని అంతా అనుకుంటారు. కానీ అతడు తిరిగొస్తాడు. రాకీతో తలపడతాడు. మొదట్లో అధీరదే పైచేయి. కానీ రాకీ వెనకడుగు వేయడు. మరోవైపు అతను కొత్తగా ఎన్నికైన భారత ప్రధాన మంత్రి రమికా సేన్ (రవీనా టాండన్)ని సవాలు చేసే స్థాయికి కూడా వెళ్తాడు. ఈ కొత్త యుద్ధంలో రాకీ విజయం సాధించాడా? శక్తివంతమైన అధీరాను, పవర్ ఫుల్ లేడీ రమికాను ఎదుర్కోగలిగాడా? చివరికి రాకీ ఏమయ్యాడు? కేజీఎఫ్ ఎలా అంతరించింది అనేది పార్ట్-2 సారాంశం.

మొదటి భాగంలో మనం చూసినట్లుగా, దర్శకుడు ప్రశాంత్ నీల్ హీరోను అద్భుతంగా ఎలివేట్ చేశాడు. ఒక్కసారి మాత్రమే కాదు, అనేకసార్లు. ఇంకా చెప్పాలంటే అడుగడుగునా హీరో ఎలివేషన్లు మనకు కనిపిస్తాయి. దీనికి తోడు అనేక ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్స్ ను కూడా రివీల్ చేశాడు. అయితే మొదటి భాగం మదర్ సెంటిమెంట్‌తో కూడిన డాన్‌కి సంబంధించిన క్లాసిక్ కథ. హీరో పాత్రకు మంచి గ్రాఫ్ ఉంది. రెండవ భాగానికి వచ్చేసరికి, హీరోతో పోరాడటానికి మరొక విలన్ అధీర, ఇతర రాజకీయ శక్తులను పరిచయం చేశాడు నీల్. ఇది డైరక్ట్ గా యుద్ధానికి దారితీసింది తప్ప, మొదటి భాగంలోని ఎమోషన్ ను క్యారీ చేయలేకపోయింది.

మొదటి భాగం ముగిసే సరికే అతను ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ డాన్ అయ్యాడు. ఇంకా అంతకన్నా శక్తివంతంగా చూపించేందుకు, గ్రాఫ్ పెంచేందుకు స్కోప్ లేదు. మొదటిభాగంలో రాకీ ఓ హీరో. నరాచీ లైమ్ స్టోన్ మైనింగ్ కంపెనీలో బానిసలుగా పనిచేస్తూ, జీవచ్ఛవాలుగా ఉన్న మనుషుల పాలిట దేవుడు. సమాజాన్ని ప్రేరేపించే, ఓ తిరుగుబాటుదారుడి కథ ఎప్పుడూ రోమాంచితంగానే ఉంటుంది. అది క్లాసిక్ ఫార్మాట్. ఛాప్టర్-1కు అదే అందం. ‘ఛాప్టర్ 2’లో ఆ అందం మిస్సయింది.

తల్లి కోరిక మేరకు ధనవంతుడు కావాలనుకున్న హీరో కసి మనకు మొదటిభాగంలో బాగా నచ్చే అంశం. కానీ, రెండో భాగంలో ఒక డైలాగ్ బలవంతంగా ఇరికించారు. తన కొడుకు చనిపోతే కూడా సుల్తాన్ గానే చావాలి హీరో తల్లి అప్పుడెప్పుడో చెప్పిన డైలాగ్ రెండో భాగానికి యాంకర్ కావడం సరియన ఎమోషన్ డ్రైవ్ కాదు.

రాకీ భాయ్ అజేయుడు, తెలివైనవాడని మనందరికీ తెలుసు. అతను ప్రపంచాన్ని తన గుప్పిట్లో పెట్టుకుంటాడు. ఎంతటి బలమైన విలన్ ని అయినా మట్టికరిపిస్తాడు. ఫస్ట్ పార్ట్ లో ఈ విషయాన్ని చాలా బలంగా ఎస్టాబ్లిష్ చేశారు. అలాంటప్పుడు సెకెండ్ పార్ట్ లో కూడా దాన్నే మళ్లీ రిపీట్ చేస్తే ఎలా? హీరోనే గెలుస్తాడని కచ్చితంగా తెలిసినప్పుడు ఎక్సయిట్ మెంట్ ఎందుకుంటుంది? రాకీ స్టయిల్, యాక్షన్, అతడి అక్రమార్జన.. ఇలా చాలా కనిపిస్తాయి. ఇంకా చెప్పాలంటే పార్ట్-2లో హీరో పాత్ర ఎలివేషన్స్, మాస్ ఎలిమెంట్స్ పైనే దర్శకుడు ఎక్కువగా దృష్టిపెట్టాడు. కథపై దృష్టి తగ్గించాడనే చెప్పాలి.

ఈసారి నీల్‌కు చెప్పడానికి కథ తగ్గిపోయింది. అతడి కథలో పాత్రలు కూడా తగ్గిపోయాయి. దీంతో అతడు చాలా చోట్ల డైలాగ్స్ పై ఆధారపడ్డాడు. సినిమా స్టార్టింగ్ లోనే నెపొటిజంపై యష్ చెప్పిన డైలాగ్స్ బాగున్నాయి. స్టార్ కిడ్స్ పై అతడు పరోక్షంగా డైలాగ్స్ వేసినట్టయింది.

ఇక సినిమాలో లాజిక్స్ పూర్తిగా మిస్సయ్యాయి. సంజయ్ దత్ తో పాటు అతని గ్యాంగ్‌పై వందల మంది మెషిన్ గన్స్ తో కాల్చినప్పుడు, ఒక్క బుల్లెట్ కూడా దత్ ను తాకదు. ఇది లాజిక్ కు ఆమడదూరంలో ఉంది. రాకీ తుపాకీని పట్టుకుని, తన మనుషులతో కలిసి పార్లమెంటు హాలులోకి ప్రవేశించే మరో సన్నివేశం ఉంది. ఏ భద్రతా అధికారి అడ్డుకోడు. తక్షణమే చికిత్స చేయకపోతే కొడుకు న్యుమోనియాతో చనిపోతాడని ఒక డాక్టర్, తల్లికి చెప్పినప్పుడు, ఆమె 5 నిమిషాల పాటు సుదీర్ఘంగా డైలాగ్ చెప్పి, అతను సుల్తాన్‌గా మాత్రమే చనిపోతాడని చెబుతుంది. ఇలాంటి లాజిక్ లేని డైలాగ్స్, సీన్లు చాలా. ఇలాంటి లాజిక్ లేని సీన్లు ఎన్ని ఉన్నప్పటికీ సినిమా మనకు నచ్చుతుందంటే దానికి కారణం.. దర్శకుడి స్క్రీన్ ప్లే. మరోసారి తన స్క్రీన్ ప్లేతో మేజిక్ చేశాడు నీల్. అతడికి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ నుంచి, యష్ నుంచి పూర్తి సహకారం అందింది.

యష్ మరోసారి దున్నేశాడు. అతడి లుక్, యాక్షన్, డైలాగ్స్… అన్నీ కట్టిపడేస్తాయి. ఖరీదైన సూట్స్ లో ఈసారి అందంగా కూడా కనిపించాడు. అధీరగా సంజయ్ దత్ భయంకరమైన రూపాన్ని చూపించారు కానీ అతని పాత్ర బలహీనంగా ఉంది. ప్రధానిగా రవీనా టాండన్ పర్ఫెక్ట్. రావు రమేష్, ఈశ్వరి రావు కొత్తగా చేసిందేమీ లేదు. ప్రకాష్‌ రాజ్‌ ఉన్నాడంటే ఉన్నాడంతే.

మొదటి భాగంలాగే ఛాప్టర్ 2 కూడా సినిమాటోగ్రాఫర్ భువన్, మ్యూజిక్ డైరక్టర్ రవి బస్రూర్ పైనే ఎక్కువగా ఆధారపడింది. రవి తన అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో సన్నివేశాలను పైకి లేపగా, సినిమాటోగ్రఫీ మరోసారి మెరిసింది. గ్రాఫిక్స్ మాత్రం బాగాలేవు. రవీనా టాండన్ ప్రజలకు అభివాదం తెలినప్పుడు, కేజీఎఫ్ పై నుంచి యుద్ధ విమానాలు వెళ్లినప్పుడు వచ్చిన గ్రాఫిక్స్ తేలిపోయాయి. బహుశా ఫస్ట్ పార్ట్ హిట్టవ్వడంతో, సెకండ్ పార్ట్ లో గ్రాఫిక్స్ ను లైట్ తీసుకున్నట్టున్నారు. దర్శకుడిగా ప్రశాంత్ నీల్, హీరోయిజాన్ని ఎలివేట్ చేయడంలో దిట్ట. మాస్ ఆడియన్స్‌కి తగ్గట్టుగా డైలాగ్స్ ఉన్నాయి.

బాటమ్ లైన్

ఓవరాల్ గా చూసుకుంటే…సూపర్ మాస్ ఎలిమెంట్స్, యాక్షన్ సన్నివేశాలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో ‘KGF 2’ మాస్, యాక్షన్ చిత్రాలు ఇష్టపడే ప్రేక్షకులని కచ్చితంగా అలరిస్తుంది. అయితే బలమైన ఎమోషన్, లాజిక్ ను మాత్రం ఛాప్టర్-2లో ఆశించొద్దు.

Rating: 3/5

 

More

Related Stories