కింగ్ ఆఫ్ కొత్త – తెలుగు రివ్యూ

Kinga of Kotha

దుల్కర్ మంచి నటుడు. అందులో ఎవ్వరికీ ఎలాంటి సందేహం అక్కర్లేదు. యాక్షన్ ఇమేజ్ తెచ్చుకోవాలనుకున్నాడు. అక్కడే వ్యవహారం తేడా కొట్టింది. దుల్కర్ నుంచి కొత్తదనం ఆశిస్తారు ప్రేక్షకులు. కానీ కింగ్ ఆఫ్ కొత్త పేరిట వచ్చిన ఈ సినిమాలో టైటిల్ లో తప్ప కథలో ఎక్కడా ఆ ‘కొత్త’ కనిపించదు.

1996లో కొత్త అనే కల్పిత నగరం ఉంటుంది. అందులో ఎక్కడ చూసినా గంజాయికి బానిసైన వాళ్లే కనిపిస్తారు. ఆ సిటీకి డాన్ కన్నా భాయ్. పోలీసులు కూడా అతడ్ని కలవడానికి భయపడతారు. అలాంటి డాన్ ను అంతం చేస్తానని, సిటీని క్లీన్ చేస్తానని సవాల్ చేస్తాడు కొత్త పోలీస్. ఆ క్రమంలో కన్నా భాయ్ చరిత్రను తవ్వే పని మొదలుపెడతాడు. కట్ చేస్తే, పదేళ్ల కిందట కన్నా భాయ్, హీరో రాజు (దుల్కర్) ఫ్రెండ్స్. నిజానికి అప్పుడు రాజే గ్యాంగ్ లీడర్. కన్నాభాయ్ అతడి అనుచరుడు మాత్రమే. కొత్త సిటీలో తార (ఐశ్వర్య లక్ష్మి)ని చూసి ప్రేమిస్తాడు రాజు. అయితే ఓ దశలో తార తనను మోసం చేసిందని భావిస్తాడు. అదే టైమ్ లో కన్నా కూడా, ప్రత్యర్థితో చేతులు కలిపి రాజుకు నమ్మకం ద్రోహం చేస్తాడు. దీంతో కోపోద్రిక్తుడైన రాజు, కన్నాను చితక్కొడతాడు. ఆ తర్వాత ఊరు వదిలి వెళ్లిపోతాడు. దీంతో కన్నా కాస్తా కన్నా భాయ్ అవుతాడు. అలా లక్నో వెళ్లిన రాజు, పదేళ్ల తర్వాత తిరిగి సిటీకి వస్తాడు. రాజు ఎందుకు మళ్లీ వచ్చాడు? ఈసారి అతడు ఎదుర్కొన్న సమస్యలేంటి? అనేది కింగ్ ఆఫ్ కొత్త.

హీరో ఊరు వదిలి వెళ్లడం, తిరిగి రావడం, సమస్యలు పరిష్కరించడం తెలుగు ప్రేక్షకులకు కొత్త కాదు. బాలయ్య, చిరంజీవి నటించిన ఫ్యాక్షన్ సినిమాల్లో ఇదే జరిగింది. వందల కొద్దీ సినిమాలున్నాయి. ఇక ఓ ఊరు, అందులో డాన్ లాంటి కథలు చాలానే వచ్చాయి. కేజీఎఫ్ అయితే ల్యాండ్ మార్క్ అయింది. సో.. “కింగ్ ఆఫ్ కొత్త” పేరిట వచ్చిన ఈ కథలో కొత్తదనం మచ్చుకు కూడా లేదు.

దీనికితోడు సినిమా నిడివి ప్రేక్షకుడికి పరీక్ష పెడుతుంది. ప్రధమార్థం పరమ బోర్ కొడుతోంది. సెకెండాఫ్ లో కాస్త డ్రామా పండినప్పటికీ, అక్కడ కూడా డ్యూరేషన్ ఇష్యూ ఉంది. ఫలితంగా సీట్లలో అసౌకర్యంగా అటుఇటు కదలడం తప్ప చేసేదేం ఉండదు.

విలక్షణ పాత్రలు, విభిన్నమైన కథలు ఎంచుకునే దుల్కర్, ఈ కథ ఎందుకు సెలక్ట్ చేసుకున్నాడనే ఆలోచన.. సినిమా చూస్తున్నంతసేపు మనసును తొలిచేస్తుంది. ఫైనల్ గా సినిమా పూర్తయిన తర్వాత, కేవలం యాక్షన్ ఇమేజ్ కోసం, పాన్ ఇండియా అప్పీల్ కోసమే దుల్కర్ ఈ పనికి ఒప్పుకున్నాడనే విషయం బోధపడి ఓ పెద్ద నిట్టూర్పు వీడుస్తాం.

సినిమా కథ పాతదే అయినా, కొత్తగా చెప్పొచ్చు. స్క్రీన్ ప్లేలో మార్పులు చేయొచ్చు. అలాంటి ప్రయత్నం కూడా జరగని సినిమా ఇది. సబ్-ప్లాట్స్ అయితే మరీ నీరసంగా ఉన్నాయి. హీరో, అతడి ఫ్రెండ్ శత్రువులుగా మారే ఎపిసోడ్స్ లో అస్సలు అర్థం లేదు. ఇలాంటి కథనానికి ప్రేక్షకుడు కనెక్ట్ అవుతారని ఎలా అనుకున్నారో మేకర్స్ కే తెలియాలి.

ఇక హీరోహీరోయిన్ల మధ్య వ్యవహారం కూడా ఓ ప్రహసనం. ఫస్టాఫ్ లో ఎందుకు తప్పుగా అర్థం చేసుకుంటాడో తెలీదు. సెకెండాఫ్ లో ఎందుకు మళ్లీ హీరోయిన్ కు దగ్గరవుతాడో తెలీదు. మళ్లీ కలిసినప్పుడు ఏం జరగనట్టు అలా ఎందుకు ప్రవర్తిస్తాడో అస్సలు అర్థం కాదు. సన్నివేశాలన్నీ చాలా కృతకంగా అనిపిస్తాయి.

ఉన్నంతలో తన యాక్టింగ్, లుక్స్ తో దుల్కర్ ఈ సినిమాను ముందుకు లాగే ప్రయత్నం చేశాడు. హీరోయిన్ క్యారెక్టర్ ఎందుకు ఉందో అర్థం కాదు. మిగతా క్యారెక్టర్స్ ఏవీ కనెక్ట్ అవ్వవు.

ఇలాంటి కథను రాసుకున్న దర్శకుడ్ని ముందుగా నిందించాలి. అతడి స్క్రీన్ ప్లే గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఈ తరహా స్క్రీన్ ప్లే తో మూడు గంటల పాటు ప్రేక్షకులను కూర్చుండబెడుతాను అని ఎలా అనుకున్నాడో. ఉన్నంతలో జేక్స్ బిజాయ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ప్రొడక్షన్ డిజైన్ ఆకట్టుకుంటాయి.

ఓవరాల్ గా “కింగ్ ఆఫ్ కొత్త” సినిమా ఎలాంటి కొత్తదనం అందించకపోగా, థియేటర్లలో మనల్ని నిద్రపుచ్చుతుంది. దుల్కర్ పై ఇష్టంతో, అతడిపై నమ్మకంతో ఈ సినిమాకు వెళ్తే మాత్రం జేబుకు చిల్లు పడినట్టే. మూడు గంటల పాటు కూర్చోవాలంటే పెద్ద రంపపు “కోత” ఫీలింగ్ కలుగుతుంది.

బాటమ్ లైన్ – కింగ్ ఆఫ్ పాత

Rating: 1.75/5

By M Patnaik

Advertisement
 

More

Related Stories