
యువ హీరో కిరణ్ అబ్బవరం రాయలసీమ నుంచి వచ్చాడు. రాయలసీమ యాసలో స్పష్టంగా డైలాగ్ లు చెప్పడం, నటనలో ఈజ్ ఉండడం అతనికి కలిసొచ్చాయి. అందుకే, అతను నటించిన రెండో సినిమా ‘SR కల్యాణమండపం’ మంచి విజయం సాధించింది. దాంతో, అతని సినిమాలపై ఫోకస్ పడింది.
ఆయన మొదటి చిత్రం ‘రాజావారు రాణీవారు’. అది థియేటర్లలో పెద్దగా ఆడలేదు కానీ ఓటిటిలో సక్సెస్ అయింది. ఇప్పుడు మరో విజయం కోసం ప్రయత్నిస్తున్నాడు. కిరణ్ అబ్బవరం మూడో చిత్రం ‘సెబాస్టియన్ PC 524’. ఇది కూడా రాయలసీమలోని మదనపల్లెలో జరిగే కథ. మదనపల్లె ప్రాంతపు యాసలోనే మాట్లాడాడు. ఈ సినిమా ట్రైలర్ బాగుంది.
ఇందులో కిరణ్ రేచీకటి ఉన్న కానిస్టేబుల్ గా నటించాడు. తన రేచీకటి విషయాన్ని అధికారుల వద్ద దాచిన ఆ కానిస్టేబుల్ ఎలాంటి సమస్యల్లో ఇరుక్కుంటాడు? ఎలా బయటపడతాడు అనేది కథ. ఫన్నీగా చెప్పే ప్రయత్నం చేశారట.
ఇది కూడా ఆడితే, కిరణ్ అబ్బవరం హీరోగా మంచి స్థితిలో స్థిరపడుతాడు. దీంతో హ్యాట్రిక్ వస్తుందని నమ్మకం ఉందని అంటున్నాడు కిరణ్. ఈ వీకెండ్ (మార్చి 4న) విడుదల కానుంది ‘సెబాస్టియన్’.