
ఒక్క సినిమా అటు ఇటు అయితే ఎంత పెద్ద దర్శకుడికైనా పుకార్లు తప్పవేమో. అనుమానాలు కూడా సహజమే. ‘ఆచార్య’కి ముందు కొరటాల శివ వేరు. ఇప్పుడు వేరు. ‘ఆచార్య’ అపజయం పాలైంది. అంత ఘోరంగా పరాజయం పాలు అవుతుందని ఎవరూ ఊహించలేదు. దాంతో, కొరటాల శివకి ఫైనాన్సియల్ సమస్యలు ఎక్కువయ్యాయని, ఎన్టీఆర్ సినిమా ఆగిపోయిందని ప్రచారం మొదలైంది.
‘ఆచార్య’ ఫ్లాప్ కావడం కన్నా ఈ ప్రచారాలు ఆయన్ని ఎక్కువగా వేధిస్తున్నాయి. ఐతే, నిజం ఏంటంటే… కొరటాల శివ, ఎన్టీఆర్ సినిమా యథావిధిగా ప్రారంభం కానుంది. సినిమా ఆగిపోవడం అనేది పూర్తిగా తప్పు.
కొరటాల శివకి ఎన్టీఆర్ పూర్తి మద్దతుగా ఉన్నారు. టెన్షన్ పడకుండా కూల్ గా స్క్రిప్ట్ పనులు, ప్రీ-ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టుకోమని ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు ఎన్టీఆర్. రెగ్యులర్ షూటింగ్ మాత్రం కాస్త ఆలస్యం కావొచ్చు. ఇంతకుమించి, ఈ సినిమాలో ఎటువంటి మార్పులేదు.
ఇక ‘ఆచార్య’ వ్యాపార లావాదేవీలు, నష్టాల పూడిక వంటివి మాత్రం ఆయనకి కొంత తలనొప్పే. వాటిని సెట్ రైట్ చేసే పనిలో ఉన్నారు. ఐతే, ఇప్పుడు కొరటాల శివ మరింత కసిగా ఎన్టీఆర్ సినిమా తీయనున్నారట. ‘ఆచార్య’ సినిమా మిస్ ఫైర్ కావడానికి రకరకాల కారణాలు ఉన్నాయి. ఎన్టీఆర్ సినిమాతో కొరటాల శివ మరోసారి అగ్రదర్శకుడిగా తన స్థానాన్ని నిలబెట్టుకోవడం ఖాయం అని ఆయన సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి.