
“ఆచార్య” కథపై నడుస్తున్న వివాదాల్ని పక్కనపెడితే.. అసలు ఈ సినిమా మళ్లీ ఎప్పుడు స్టార్ట్ అవుతుందనేది సగటు సినీ అభిమాని ప్రశ్న. తాజాగా దీనిపై దర్శకుడు కొరటాల శివ స్పందించాడు. ఇప్పట్లో “ఆచార్య” మూవీ సెట్స్ పైకి వచ్చే పరిస్థితులు లేవన్న కొరటాల.. మరో 2 నెలల్లో పరిస్థితులు చక్కబడతాయనే నమ్మకంతో ఉన్నాడు.
“ఆచార్య మళ్లీ ఎప్పుడు సెట్స్ పైకి వస్తుందో ఇప్పుడే చెప్పలేను. ఎందుకంటే పెద్ద సినిమా ఇది. కనీసం 150 మంది పని చేస్తారు. పైగా అందరం క్లోజ్ గా వర్క్ చేయాల్సిన పరిస్థితి. కాబట్టి పెద్దవాళ్లు ఎవరైనా ఉన్నారా, ఆల్రెడీ జబ్బులు ఉన్నవాళ్లు ఎవరైనా ఉన్నారా అనే విషయం చూడాలి. అందుకే ఇంత తర్జన భర్జన,” అని అసలు విషయం బయట పెట్టాడు కొరటాల.
“ముఖ్యంగా మాకు ధైర్యం రావాలి. ఒకవేళ ధైర్యం చేసి మేం త్వరగా షూటింగ్ పూర్తిచేసినా, థియేటర్లు ఓపెన్ చేసిన తర్వాత జనాలు వస్తారా రారా అనే అనుమానాలు కూడా ఉన్నాయి. రాబోయే 2 నెలల్లో అన్నింటిపై చిన్న క్లారిటీ వచ్చి ముందుకెళ్తామనే ఆశతో ఉన్నాను.” ఇది కొరటాల మాట.
ఇలా “ఆచార్య” షూటింగ్ పై స్పందించాడు కొరటాల. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటివరకు 40శాతం మాత్రమే షూటింగ్ పూర్తయింది. కొత్త షెడ్యూల్ ప్రారంభమైన వెంటనే సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న రామ్ చరణ్ పై షూటింగ్ చేసేందుకు యూనిట్ ప్రయత్నిస్తోంది.