
ఈ వీకెండ్ విడుదల అవుతోన్న సినిమా… జెట్టి. ఈ సినిమాతో కృష్ణ మన్యం హీరోగా పరిచయం అవుతున్నారు. ఈ సందర్భంగా కృష్ణ మన్యంతో ముచ్చట్లు.
చిత్తూరు నుంచి హైదరాబాద్ కు
“నా స్వస్థలం చిత్తూరు జిల్లా. చిన్నతనంలోనే యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్‌తో డిగ్రీ మానేసి హైదరాబాద్ వచ్చాను. దూరదర్శన్ కోసం ఒక ఎపిసోడ్… ఈటీవీ కోసం తూర్పు వెళ్లే రైలు సీరియల్‌లో మూడు ఎపిసోడ్స్‌లో నటించాను. కోట శ్రీనివాసరావు దగ్గరికి ఫోటో దిగడానికి వెళితే ముందు డిగ్రీ చదువుకో… ఆ తర్వాత ఇండస్ట్రీలో ఆఫర్ల కోసం ప్రయత్నించమని సలహా ఇచ్చారు. దాంతో డిగ్రీ చేసేందుకు మళ్ళీ మా ఊరు వెళ్ళాను. డిగ్రీ పూర్తి చేసిన తర్వాత జాబ్స్ చేశాను. కానీ నా మససంతా సినిమాపైనే ఉంది. అదే సమయంలో నా బావ గల్లా జయదేవ్ కుమారుడు గల్లా అశోక్ ఇండస్ట్రీలోకి రావడానికి ప్రయత్నిస్తూ.. చెన్నైలో పాండ్యన్ మాస్టర్ వద్ద శిక్షణ తీసుకొన్నాడు. నేను కూడా గల్లా అశోక్‌తో కలిసి ట్రైనింగ్ తీసుకొన్నాను. అది నా కెరీర్‌కు ఇప్పుడు బాగా ఉపయోగపడింది.”
మొదటి సినిమా ఆగింది
ఓ లవ్ స్టోరి సినిమాలో మొదటి అఫర్ వచ్చింది. కానీ ఆ సినిమా రిలీజ్ ఆగిపోయింది. నా కెరీర్ ఎలా అనుకుంటున్న టైంలో “జెట్టి” మూవీలో ఆఫర్ దక్కింది. షూటింగ్‌కు ముందు కరోనా వైరస్ కారణంగా సినిమా పరిశ్రమ స్థంభించింది. ఆ తర్వాత 2020 నవంబర్‌లో ఒకే షెడ్యూల్‌లోనే జెట్టి సినిమా పూర్తి చేశాం.
ఎమోషనల్ మూవీ… జెట్టి
జెట్టి అంటే.. ఫిషింగ్ హార్బర్.. కోస్తాంధ్రకు జెట్టిలు ఎందుకు అవసరం? సముద్ర తీర ప్రాంతాన్ని, సముద్రాన్ని కలిపే వంతెనను జెట్టి. ఈ జెట్టి అవసరం ఏమిటనే కోణంలో కథ సాగుతుంది.
జెట్టి సినిమా మత్స్యకారుల జీవితాల చుట్టూ తిరుగుతుంది. అలాగే ఒక తండ్రి ఎమోషన్ ఉంటుంది. ఈ సినిమాలో “దూరం కరిగిన “పాటకు 19 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేయించడానికి ఇటీవల గోపిచంద్ మలినేనిని కలిశాను. మా ట్రైలర్ చూసిన తర్వాత.. క్రాక్ సినిమాలో ఇలాంటి సీన్లు చేయాలని అనుకొన్నాను. కానీ లైటింగ్, సమయం లేకపోవడం వల్ల మీరు తీసిన సీన్లను తీయలేకపోయాం.. జెట్టీ సినిమాలో సీన్లు చాలా అద్బుతంగా ఉన్నాయి అని ప్రశంసించారు.
అన్ని పాత్రలకు రెడీ
నేను హీరోగానే కాకుండా ఎలాంటి పాత్రలనైనా చేయడానికి నేను సిద్దం. మంచి నటుడిగా నేను గుర్తింపు పొందే పాత్రలను చేయడానికి రెడీగా ఉన్నాను. యాక్టింగ్ విషయంలో రానా, నవీన్ చంద్ర నాకు ఇన్సిపిరేషన్.