డ్యూయెట్లు …రికార్డులు!


ఇప్పుడు ఒక హీరో, హీరోయిన్ కలిసి రెండు, మూడు సినిమాల్లో నటిస్తే వారి మధ్య ఉన్న కెమిస్ట్రీ గురించి పుకార్లు షికార్లు చేస్తున్నాయి. కానీ సూపర్ స్టార్ కృష్ణ పలువురు హీరోయిన్లతో 30, 40 సినిమాల్లో నటించడం విశేషం.

తన రెండో భార్య విజయ నిర్మలతో అత్యధికంగా 48 సినిమాల్లో నటించారు కృష్ణ. పెళ్ళికి ముందే చాలా సినిమాల్లో కలిసి నటించారు. ఆ తర్వాత కూడా జతగా సినిమాలు చేశారు. మలయాళంలో ప్రేమ్ నజీర్ – షీల తర్వాత ఎక్కువగా కలిసి నటించిన జంట కృష్ణ – విజయ నిర్మలదే.

జయప్రద – కృష్ణ … సూపర్ హిట్ పెయిర్. ‘సింహాసనం’ వంటి సంచలన చిత్రాలు వీరి కలయికలో వచ్చాయి. వీరి కాంబినేషన్ లో కూడా దాదాపు 47 చిత్రాలు వచ్చాయి.

ఇక అప్పటి అందాల నటి శ్రీదేవితో కృష్ణ నటిస్తే సినిమా హిట్ అనే పేరు ఉండేది. వీరి కాంబినేషన్లో వచ్చిన చిత్రాలు… 31. అవును శ్రీదేవి బాలీవుడ్ లో బిజీ కాకముందు ఎక్కువగా కృష్ణతోనే నటించారు. విచిత్రం ఏమిటంటే శ్రీదేవి బాలనటిగా కృష్ణకి కూతురుగా కూడా నటించారు. ఆ సినిమా పేరు… మా నాన్న నిర్దోషి. ఘరానా దొంగ, కిరాయి కోటిగాడు, అడవి సింహాలు, వజ్రాయుధం, పచ్చని కాపురం వంటి హిట్ చిత్రాల్లో కృష్ణ, శ్రీదేవి కలిసి నటించారు.

హీరోయిన్ రాధతో కూడా కృష్ణ 30 సినిమాల్లో కలిసి నటించారు. శక్తి, అగ్నిపర్వతం, జమదగ్ని వంటి సినిమాలున్నాయి వీరి కాంబినేషన్ లో. విజయ నిర్మల, శ్రీదేవి, జయప్రద, రాధ… ఒక్కొక్కరు 30కి పైగా సినిమాల్లో కృష్ణతో జత కట్టడం విశేషం.

 

More

Related Stories