
సాహసం ఆయన ఊపిరి. మంచితనం ఆయన గుణం.
తన బలాలు, బలహీనతలు తెలిసిన వాళ్లే విజేతలవుతారు. సూపర్ స్టార్ కృష్ణకి తన బలహీనతలేంటో తెలుసు. వాటిని ఎలా అధిగమించాలో కూడా తెలుసు. అందుకే ఆయన సూపర్ స్టార్ అయ్యారు. ప్రయోగాలకు వెరువలేదు. ఎప్పటికప్పుడు కొత్తదనం కోసం ప్రయత్నిస్తూ తనకంటూ ఒక అభిమాన గణం ఏర్పాటు చేసుకున్నారు.
ఎన్టీఆర్, ఏఎన్నార్ వంటి శిఖర సమాన నటులు ఉన్న కాలంలో హీరోగా ఎదగాలంటే వారికి భిన్నంగా ఎదో చెయ్యాలి. ఆ ప్రణాళికతోనే జేమ్స్ బాండ్ తరహా చిత్రాలు, యాక్షన్ మూవీస్, కౌబాయ్ చిత్రాలు చేశారు కృష్ణ. పౌరాణిక చిత్రాలు, ప్రేమకథలు, సెంటిమెంట్ మూవీస్, మల్టీస్టారర్ మూవీస్… ఆయన అటెంప్ట్ చెయ్యని జాన్రా లేదు.
మోసగాళ్లకు మోసగాడు, అల్లూరి సీతారామరాజు, కురుక్షేత్రం, దేవుడు చేసిన మనుసులు, సింహాసనం, ఈనాడు, వంటి చిత్రాలు ఆయన సాహసానికి ప్రతిబింబాలు.
తెలుగు సినిమాకి ఎన్నో కొత్తవాటిని అందించిన ఘనత ఘట్టమనేని కృష్ణకే చెందుతుంది. ఆయన ఖాతాలో ఎన్నో ‘తొలి’ పరిచయాలు.
తొలి సినిమా స్కోప్ చిత్రం … అల్లూరి సీతారామరాజు
తొలి కౌబాయ్ చిత్రం … మోసగాళ్లకు మోసగాడు
తొలి సాంఘిక సినిమా స్కోప్ చిత్రం … దేవదాసు
తొలిసారిగా పాటకు జాతీయ అవార్డు పొందిన చిత్రం … అల్లూరి సీతారామరాజు
తొలి 70MM చిత్రం …. సింహాసనం
తొలి DTS చిత్రం… తెలుగు వీర లేవరా