
అయోధ్యలో ప్రధాని శంకుస్థాపన చేసిన రామమందిరం ఎంత ఫేమస్ అయిందో.. ప్రభాస్ నటించబోయే “ఆదిపురుష్” ప్రాజెక్టు కూడా ప్రపంచవ్యాప్తంగా అంత ఫేమస్ అవుతుందంటున్నారు ఆయన పెదనాన్న, నటుడు కృష్ణంరాజు.
“ప్రధాని నరేంద్ర మోడీ అయోధ్యలో రామమందిర నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. సరిగ్గా అదే పీరియడ్ లో ప్రభాస్ ఆదిపురుష్ సినిమా ప్రకటించాడు. ప్రపంచవ్యాప్తంగా రామమందిరం ఎంత ప్రాచుర్యం పొందుతుందో.. ప్రభాస్ ఆదిపురుష్ ప్రాజెక్టు కూడా అంతే పాపులర్ అవుతుంది.”
మహావిష్ణువు దశావతారాలకు సంబంధించిన ఓ అవతారం నేపథ్యంలో “ఆదిపురుష్” సినిమా రాబోతోందని స్పష్టంచేశారు కృష్ణంరాజు. మరోవైపు కరోనా పరిస్థితులపై కూడా స్పందించారు. కరోనా ఎంతోమందికి ఎన్నో పాఠాలు నేర్పించిందని, తను కూడా కరోనా నుంచి నేర్చుకున్నానని అన్నారు.
“మా మూడో అమ్మాయి నాకు క్షవరం చేస్తుంది. మేకప్ వేస్తుంది. రెండో అమ్మాయి ఇంటి పనులు, వంట పనులు చేస్తోంది. పెద్దమ్మాయి మిగతా పనులన్నీ చూసుకుంటూ, నాకు సహాయం చేస్తుంది. ఈ ముగ్గుర్నీ పర్యవేక్షిస్తుంటుంది మా ఆవిడ. ఓవరాల్ గా చెప్పాలంటే సింపుల్ గా ఎలా జీవించాలనేది నాకు, మా పిల్లలకు అలవాటైంది. పోష్ గా (లగ్జరీ) బతకడం చాలామందికి తెలుసు. కానీ సింపుల్ గా ఎలా ఉండాలో తెలీదు. కరోనా అది నేర్పింది.”
ఈ లాక్ డౌన్ టైమ్ లో సినీకార్మికుల కోసం సీసీసీ ద్వారా చిరంజీవి చేసిన సేవల్ని ప్రత్యేకంగా మెచ్చుకున్నారు కృష్ణంరాజు.