చైతన్య హిందీ మూవీ రిలీజ్ వాయిదా

- Advertisement -

నాగ చైతన్య హిందీలోకి అడుగుపెడుతున్నాడు. అతను నటించిన తొలి చిత్రం… “లాల్ సింగ్ చద్దా”. అమీర్ ఖాన్ హీరోగా నటిస్తున్న ఈ భారీ బాలీవుడ్ చిత్రంలో నాగ చైతన్య ఒక కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ సినిమా ఈ క్రిస్మస్ కి విడుదల కావాలి. కానీ ఈ సినిమా విడుదలని అమీర్ ఖాన్ మరోసారి వాయిదా వేశారు.

మహారాష్ట్రలో థియేటర్లు ఇంకా ఓపెన్ కాలేదు. అక్టోబర్ 22 తర్వాత థియేటర్లు నడిపేందుకు అనుమతి ఇస్తామని ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ఇటీవలే ప్రకటించారు. ఐతే, చాలా కాలంగా విడుదలకు రెడీగా ఉన్న ఇతర పెద్ద సినిమాలు క్యూలో ఉన్నాయి. వాటికి దారి ఇస్తూ తన సినిమాని వచ్చే ఏడాది వాలెంటైన్స్ డే స్పెషల్ గా విడుదల చెయ్యాలనేది అమీర్ ఖాన్ ప్లాన్.

“థియేటర్లు తిరిగి ప్రారంభించేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నాం. ఐతే, కరోనా వల్ల మా నిర్మాణ పనుల్లో జాప్యం జరిగింది. కాబట్టి మా లాల్ సింగ్ చద్దా చిత్రాన్ని ఈ క్రిస్మస్ కి విడుదల చెయ్యలేక పోతున్నాం. వచ్చే వాలెంటైన్స్ డే (ఫిబ్రవరి 2022)కి మా సినిమా థియేటర్లలోకి వస్తుంది,” అని అమీర్ ఖాన్ ఒక ప్రకటన విడుదల చేశారు.

ఈ సినిమా షూటింగ్ సమయంలోనే అమీర్ ఖాన్, నాగ చైతన్య మధ్య మంచి స్నేహం ఏర్పడింది. నాగ చైతన్య మంచి వ్యక్తిత్వం ఉన్న నటుడు అని అమీర్ ఖాన్ ప్రశంసించారు. ఇటీవల చైతన్య నటించిన ‘లవ్ స్టోరీ’ ప్రీ-రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా కూడా అమీర్ ఖాన్ రావడం విశేషం.

సో, నాగ చైతన్య బాలీవుడ్ మూవీని చూడాలంటే ఆయన అభిమానులు ప్రేమికుల రోజు వరకు ఆగాలి.

 

More

Related Stories