
లక్ష్మి మంచు కూడా ఖాకీ అవతారంలోకి మారుతోంది. ఆమె ఒక తమిళ చిత్రం సైన్ చేసింది ఇటీవల. ఈ సినిమాలో ఆమె పొలీసు అధికారిగా కనిపించనుంది. అంటే, విజయశాంతిలా లక్ష్మి కూడా లాఠీ పట్టుకొని పోలీస్ కర్తవ్యం నిర్వహిస్తుంది అన్నమాట.
గతంలో తమిళ సినిమా రంగంలో కాజల్ అగర్వాల్, నయనతార, జ్యోతిక లేడీ పోలీసుగా మెప్పించినట్లే తానూ రాణించగలుగుతాను అని ధీమా వ్యక్తం చేస్తోంది. పలువురు పోలీసు అధికారిణులతో మాట్లాడి తన హోమ్ వర్క్ కూడా పూర్తి చేసిందట.
లక్ష్మి ప్రస్తుతం ఎక్కువగా తమిళ, మలయాళ సినిమాలు సైన్ చేస్తోంది. తెలుగులో ఆమెకి అవకాశాలు తగ్గిపోయాయి. తన తండ్రితో కలిసి సొంత బ్యానర్లో ఒక మూవీ చేస్తున్న మాట నిజమే. కానీ ఇతర తెలుగు దర్శకులు, నిర్మాతలు మాత్రం కొత్తగా ఆఫర్లు ఇవ్వడం లేదు. దాంతో ఇతర భాషల వైపు చూపు వేసింది.
ఆ మధ్య రెండు ఓటిటి సినిమాలు చేసింది. కానీ అక్కడ కూడా పెద్దగా ఆసక్తికరమైన పాత్రలు రావట్లేదు ఆమెకి.