
‘ఖైదీ’, ‘మాస్టర్’, ‘విక్రమ్’… ఈ మూడు సినిమాలతో యువ దర్శకుడు లోకేష్ కనగరాజ్ పెద్ద దర్శకుల జాబితాలోకి చేరిపోయాడు. ముఖ్యంగా ‘విక్రమ్’ సినిమా తమిళనాడులో అన్ని రికార్డులను బద్దలు కొట్టింది. దాంతో, అతని స్థాయి మారిపోయింది. ఇప్పుడు తమిళ చిత్రసీమలో టాప్ డైరెక్టర్ గా స్థిరపడిపోయాడు.
ఆయన తదుపరి చిత్రం విజయ్ తోనా, సూర్యతోనా అన్నది ఇంకా ప్రకటించలేదు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ చేసుకునే పనిలో పడ్డాడు.
“కొన్ని రోజులు సోషల్ మీడియాకి దూరంగా ఉండబోతున్నాను. ఇకపై నా నుంచి పోస్టులు ఉండవు. కొత్త సినిమా స్క్రిప్ట్ వర్క్ మొదలైంది. మళ్ళీ కలుద్దాం,” అంటూ పోస్ట్ పెట్టాడు. స్క్రిప్ట్ రాసుకునే టైంలో ఎవరికీ అందుబాటులో ఉండడట ఈ దర్శకుడు.
లోకేష్ ‘ఖైదీ 2’ తీద్దామనుకుంటున్నాడు. ‘ఖైదీ 2’లో సూర్య, కార్తీ ఇద్దరూ నటిస్తారు. ఇక, ‘విక్రమ్ 2’ కూడా ఆలోచనలో ఉంది. విజయ్ తో ఒక మూవీ కమిట్ మెంట్ ఉంది. ఇందులో ఏది మొదలు పెడుతాడో చూడాలి.