
తెలుగు సినిమాల నిర్మాతలు ఒక విడుదల తేదీ ప్రకటించడం, మళ్ళీ వాయిదా వేయడం వేస్తున్నారు. కరోనా రెండో వేవ్ వల్ల ఏర్పడ్డ అయోమయ పరిస్థితుల వల్ల ఇదంతా. ఇప్పటికే అనేక సినిమాలు తమ రిలీజ్ డేట్స్ ని మార్చుకున్నాయి. ఇప్పుడు ‘లవ్ స్టోరీ’ కూడా వాయిదా పడింది. సెప్టెంబర్ 10న విడుదల అవుతుందని ప్రకటించి వారం కూడా కాలేదు. అప్పుడే సినిమాని వాయిదా వేస్తున్నారు.
ఐతే, ఈ సినిమా సెప్టెంబర్ 10 నుంచి తప్పించడం నిర్మాత సునీల్ నారంగ్ కి పెద్ద అవమానమే. ఎందుకంటే…. మేం 10వ తేదీన ‘లవ్ స్టోరీ’ విడుదల చేస్తామని ప్రకటించిన తర్వాత ‘టక్ జగదీష్’ మేకర్స్ అదే రోజు అమెజాన్ లో ఎలా విడుదల చేస్తారు అంటూ ఆయన ఆవేశపడ్డారు. అంత హడావిడి చేసి.. ఇప్పుడే ఆయనే 10వ తారీఖున సినిమాని రిలీజ్ చెయ్యడం లేదు. నాని నటించిన ‘టక్ జగదీష్’ మాత్రం సెప్టెంబర్ 10నే వస్తోంది.
ఇప్పుడు ఎవరిది పైచేయి అయింది? నానిదే కదా! సునీల్ నారంగ్ ఆవేశానికి అర్థమే లేకుండా పోయింది.
శేఖర్ కమ్ముల తీసిన ఈ సినిమా ఇప్పటికే జనంలో ఎంతో క్రేజ్ సంపాదించుకొంది. ‘సారంగ దరియా’ పాట సంచలనం సృష్టించింది. ఇంత బజ్ ఉన్న సినిమా విడుదల విషయంలో మాటిమాటికీ నిర్ణయాలు మార్చుకుంటే ఎలా అని నిర్మాతలే ఆలోచించుకోవాలి. నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన ఈ మూవీకి పవన్ సంగీతం అందించాడు. సునీల్ నారంగ్ కి చెందిన నిర్మాణ సంస్థ నిర్మించింది.